Cyclone Arnab: ఎల్‌నినో ప్రభావంతో వెలవెలబోయిన జలాశయాలకు.. అర్నబ్ తుపాన్ బూస్టింగ్ ఇచ్చింది. వర్షాలు కొత్త కళ తప్పిన జలశయాలు .. కుండపోత వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరువయ్యాయి. అర్నబ్ తుపాన్ తర్వాత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ప్రధాన జలాశయాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? చూద్దాం.
కుండపోత వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీ వరద
అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలు జలాశయాలకు కొత్త ఊపిరి పోశాయి. విజయనగరం జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 297 అడుగులు కాగా.. ప్రస్తుతం 294.50 అడుగులకు చేరింది. రిజర్వాయర్ దాదాపు 90.6 శాతం నిండింది. ప్రాజెక్టులోకి 25 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ
ఇక మెంటాడ మండలంలోని ఆంధ్ర జలాశయంలోనూ నీటి నిల్వలు పెరిగాయి. అర్నబ్ తుపాన్‌కు ముందు సుమారు 42 శాతంగా ఉన్న నీటి నిల్వ.. తాజాగా 82.8 శాతానికి చేరింది. ఆండ్ర జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నీటిమట్టం 478.68 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 475.30 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 378 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నీటి నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాల్లో వరద హోరు
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అర్నబ్ తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు బ్యారేజీలోకి భారీగా నీరు చేరింది. తోటపల్లి బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.53 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 75.7 శాతం నీటి నిల్వ నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 344 అడుగులు కాగా.. ప్రస్తుతం 341.31 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 10,562 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 11,534 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం..
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలోని పెద్దగడ్డ జలాశయంలోనూ వరద నీటి చేరికతో నిల్వలు పెరిగాయి. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.07 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నీటిమట్టం 213.80 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం సుమారు 211.30 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 2,339 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అర్నబ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జలాశయాలకు జలకళను తీసుకొచ్చాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. వరద ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: వామ్మో దొంగలంటే వీళ్లే రా బాబోయ్.. ఒకే రాత్రి 4 ఇళ్లు ఊడ్చేసి ఎలా పారిపోయారంటే?