Jana Sena Party: జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి ఎందుకు దూరంగా జరిగింది? జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయి లో ఆవిర్భావ వేడుకలను పరిమితం చేయడానికి కారణాలేంటి? ఆవిర్భావ దినోత్సవ వేడుకుల చేయకపోవడానికి నిజంగా వాతావరణ పరిస్థితులే కారణమా? లేదా వేరే కారణాల వల్ల పిఠాపురంలో ఆవిర్భావ సభ వేడుకలను రద్దు చేసుకున్నారా? ఇంతకీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో ఎందుకు నిర్వహించడం లేదు? అసలు ఏం జరిగింది?.
జనసేన పార్టీ (Jana Sena Party) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన గెలిచిన మొదటి ఏడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు . పదేళ్ల పోరాటంలో తన వెనక నడిచిన నాయకులను, తాను ఎదుర్కొన్న సంఘర్షణను, పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలను ఇలా అన్ని విషయాలు మీద మనసు విప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంతేకాదు పిఠాపురం వేదికగా అతిపెద్ద నిర్ణయాన్ని కూడా ప్రకటించారు.. ఇకపై జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు పిఠాపురం గడ్డం మీద నిర్వహిస్తామంటూ ప్రకటన కూడా చేశారు… అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజల కోసం.. అక్కడే ఆవిర్భావ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాదు అప్పట్లో పిఠాపురం సభ సూపర్ సక్సెస్ కావడంతో నేతల్లో కార్యకర్తలు ఫుల్ జోష్ కనబడింది.
Also Read: Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
సీన్ కట్ చేస్తే…. ఏడాది తర్వాత.. అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదని స్వయంగా పార్టీ ప్రకటించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ.. జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.. దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందట. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను.. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జనసైనికులను కూడా విస్మయానికి గురి చేస్తుందట. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని.. అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన పార్టీ ప్రకటించినా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతుందట.
ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో, నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం… కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో… జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారంటున్నారు. నామినేటెడ్ పదవులు విషయంలో సైతం జనసేన నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుందట. అంతేకాదు కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని, మరో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని, కూటమి ధర్మాన్ని పాటించకపోతే మొహమాటం లేకుండా బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో… జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నచ్చడం లేదని చర్చ సాగుతుందట. జనసైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం, వారికి నచ్చడం లేదనేదని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్.
అంతేకాదు…కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో.. జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెట్టడం ద్వారా.. అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యో అవకాశం ఉందనే సమాచారంతో… రాష్ట్రస్థాయి వేడుకలు కాకుండా… జిల్లా, మండల స్థాయికి ఆవిర్భావ వేడుకలను పరిమితం చేశారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురం లో ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది.. గత ఏడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం, పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగింది ఏమో గాని, రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసాం.. దాని స్థానంలో యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది. చివరికి దాన్ని కూడా రద్దు చేసి .. ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు మండలాలకు మాత్రమే పరిమితం చేసింది జనసేన పార్టీ.. ఇలానిర్ణయాలు తీసుకుని వెనక్కి తగ్గడం వెనుక… కారణాలు పార్టీలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ప్రధాన కారణమనే టాక్.
మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం… సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికే అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది.. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతుందా కేవలం 7, 8 లక్షల మాత్రమే చేయగాలిగారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందట. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా రెండు సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022 లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది… అయితే అధికారంలో ఉన్న సమయంలో… పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించకపోవడం జనసేన పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదట. ఏది ఏమైనప్పటికీ… పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదని పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. ఆ క్రమంలో ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయట.
Story by Apparao, Big tv
Also Read: Iftar Controversy: హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం.. చించి పారేసిన బీజేపి నాయకురాలు