Social Issue: ప్రేమ… అంటే రెండక్షరాల పదం మాత్రమే కాదు. ప్రేమంటే ఒకరిపై ఒకరికి కలిగే ఆకర్షణ అంతకంటే కాదు.. ప్రేమంటే ఒకరంటే ఒకరికి ఏర్పడ్డ గౌరవం, అభిమానం. ‘ప్రేమంటే ఆక్రమణ కాదు.. ఆరాధన’ అన్నాడు చలం. ప్రేమించటమే కాదు.. ప్రేమించబడటమూ గొప్పేనని మరో కవీశ్వరుడి మాట. మరి.. ఇంత మధురమైన, పవిత్రమైన ప్రేమ నేడు యువతకు మధుర జ్ఞాపకాలను ఇవ్వటానికి బదులు భయంకరమైన అనుభవాలను మిగుల్చుతోంది. ప్రేమ పేరుతో రాక్షస చర్యలకు దిగి, మనసివ్వని నేరానికి ప్రాణాలు తీస్తున్న ఉన్మాదుల సంఖ్య సమాజంలో నేడు వేగంగా పెరుగుతోంది. ప్రేమ పేరుతో యువతుల వెంటపడుతున్న పోకిరీలు.. తమ ప్రేమను అంగీకరించని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తు్న్నారు. తాము ఇష్టపడిన వ్యక్తులు… వేరొకరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు. ఉన్మాదుల్లా మారి గొంతు కోస్తున్నారు. ‘నాకు దక్కనిది మరెవ్వరికి దక్కద్దు’ అనే ధోరణి నేటి యువతలో పెరిగిపోతోంది. అదో హీరోయిజంలా వారు ఫీలవుతున్నారు. చదువుకొని.. లైఫ్‌లో సెటిల్ అవ్వాల్సిన వయసులో పెడదారి పట్టి తమ జీవితాలను కోల్పోతున్నారు. తాము ఏం చేసినా శిక్ష పడడనే ధోరణి కూడా కొన్ని వర్గాల యువతలో పెరుగుతోంది. తననే ప్రేమించాలని, లేదంటే యాసిడ్ పోస్తామని బెదిరించటం, కత్తులతో దాడి చేయటం, గొంతు నులుమి చంపటం వంటి ఘటనలను బట్టి మన యువత ఎంత బలహీన మనస్కులుగా ఉన్నారో తెలుస్తోంది. ముక్కుపచ్చలారని వయసులోనే ప్రేమ పేరుతో జరిగే హింసకు బలైపోయిన యువతుల ఉదంతాలు, పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో ఉసురు తీసుకుంటున్న ప్రేమికుల ఆత్మహత్యలు, కులం పేరుతో జరిగే పరువుహత్యలను తలచుకున్నప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఉన్మాదుల ఘాతుకాలకు ముక్కు పచ్చలారని యువతులు బలైపోయిన ఘటనను మీడియాలో చూసిన ప్రతిసారీ మన పిల్లలు సురక్షితమేనా అని ఆడపిల్లల తల్లిదండ్రుల మనసులో ఒక తెలియని భయం కలుగుతోంది.
గ్లోబలైజేషన్ కారణంగా మన దేశ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, కుటుంబ, ఆర్థిక వ్యవస్థలలో అనేక మార్పొలొచ్చాయి. విదేశీ జీవనశైలి, స్వేచ్ఛగా జీవించాలనే ధోరణి, చిన్న వయసులోనే కార్పొరేట్ కొలువులు దక్కటంతో తమకు నచ్చిన దారిలో నడవాలనే ఆలోచనతో యువత ముందుకు సాగటం నేడు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రేమలో ఉన్న యువతీ యువకులు ప్రేయసీ ప్రియులుగా కలిసి సహజీవనం చేయటం నగరాల్లో సాధారణమైన అంశంగా మారింది. దీనిని సమాజపు అంగీకారం పూర్తిగా లేకున్నా.. న్యాయ వ్యవస్థ దీనికి జై కొట్టింది. దీంతో ప్రేయసీ ప్రియులు తమ కుటుంబాలకు పర్యవేక్షణకు దూరంగా జీవిస్తున్నారు. అయితే, ఈ సహజీవన సమయంలో వారి మధ్య తలెత్తే చేస్తున్న ప్రేమికుల మధ్య చిన్నా పెద్ద అపార్థాలతో విభేదాలు తలెత్తినప్పుడు క్షణికావేశంలో ఉన్మాదులుగా మారుతున్న ప్రియులు తమ ప్రియురాళ్లను ముక్కలు, ముక్కలుగా నరుకుతున్న వైనం ఆందోళనకలిగిస్తోంది. శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా జంతువులాగా ముక్కలు, ముక్కలు చేసిన ఘటన తర్వాత ఆ ప్రేయుడికి ఉన్నది ఉన్మాదమే తప్ప మరోటి కాదని అర్థమవుతోంది.
మరోవైపు ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ పెరుగుతున్నాయి. వేరే కులం అబ్బాయిని ప్రేమించిందనే కారణంతో పరువు హత్యలకు దిగుతున్న సందర్భాలూ తక్కువేం కాదు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్య పరువు హత్య వర్తమాన సమాజపు వాస్తవికతను కళ్లకు కట్టినట్లు చూపించింది. గతంలోని మూఢ నమ్మకాలు, పెళ్లిళ్ల విషయంలో కులాల పట్టింపులు ఇప్పుడు కాస్త తగ్గాయి. తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం కుదిరిన చోట పెద్దలు సైతం కులాల పట్టింపులను పక్కన పెట్టేస్తున్నారు. పెద్దలను ధిక్కరించి ప్రేమ వివాహాలు చేసుకొని, కొంత కాలానికి పెద్దల దీవెనలు పొందుతున్నారు. అయితే, ఇలాంటి విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటంలో మన యువత ఫెయిల్ అవుతోంది. పిరికితనంతో మరణమొక్కటే పరిష్కారం అనే ధోరణి పెరిగిపోతోంది. యువతలో పెరుగుతున్న ఈ ధోరణి కన్నవారికి కడుపుకోత మిగుల్చుతోంది. ఇక.. తమ వివాహేతర సంబంధాల గురించి నిలదీసిన జీవిత భాగస్వాములను చంపే ధోరణి కూడా బాగా పెరిగిపోతోంది. ఈ అమానవీయ రాక్షస ప్రవృత్తిని ప్రేరేపిస్తున్న అంశాలను గుర్తించి, తగిన పరిష్కారాలు కనుగొనలేకపోతే, మహిళల జీవనం మరింత కష్టతరం కానుంది. అలాగే క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకోవడం ద్వారా మానవాతీత శక్తులను వశం చేసుకోవచ్చనే భ్రమతో చిన్నారులను, అమాయకులను నరబలులిస్తున్న ఘటనలూ 21వ శతాబ్దంలో భారత సమాజపు వెనకబాటుదనాన్ని సూచిస్తున్నాయి.
సమాజంలో మహిళలకున్న సమున్నత స్థానం, వారి హక్కులను యువతకు తెలియజేసి, యవ్వనంలో అడుగుపెట్టేవారికి తమ బాధ్యతలను తెలిపేందుకు జాతీయ యువజన విధానాన్ని రూపొందించారు. స్కూలు నుంచి వర్సిటీ దాకా యువతకు దీనిపై కౌన్సిలింగ్ ఇచ్చి, వారి హక్కులను, బాధ్యతలను తెలియజెప్పాలని అందులో సూచించారు. అయితే, ఈ విధానపు లక్ష్యాలు నెరవేరే దిశగా మన ప్రభుత్వాలు ఏ చర్యలూ తీసుకోవటం లేదనే చెప్పాలి. మరోవైపు.. ప్రసార మాధ్యమాలు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటూ ఇలాంటి హింసాత్మక ఘటనలు పదే పదే చూపటం వల్ల యువతపై దాని ప్రభావం పడుతోంది. ఈ విషయంలో టీవీ చానళ్లు స్వీయ నియంత్రణ పాటిస్తే సమాజానికి మేలు చేసినట్టే. ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు పౌర సమాజం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం, చట్టపరమైన చర్యల్లో తీవ్రత లేకపోవటం విచారకరం. ఈ అమానవీయ ఘటనలపై మహిళా కమిషన్ల వంటి స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన రాజ్యాంగ సంస్థలు, న్యాయ స్థానాలు సుమోటోగా స్వీకరించి, తక్కువ సమయంలో శిక్షలు వేసే విధానం లేకపోవటమూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావటానికి దోహదపడుతున్నాయి. అలాగే, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రేమోన్మాదంతో దాడి చేసినా, లైంగిక వేధింపులతో విరుచుకుపడినా ఆ కేసును కేవలం భౌతిక దాడిగానో, హత్యాయత్నంగానో నమోదు చేస్తు్న్నారు. దీనిని సరిచేయాల్సి ఉంది.
దేశ రాజధానిలో మానవమృగాల వేటకు గురైన ‘నిర్భయ’, భాగ్యనగరంలో రాక్షసత్వానికి బలైన ‘దిశ’, మారుమూల పల్లెలో పసిమొగ్గపై జరిగిన వికృతదాడితో ‘చైత్ర’… ఇలా పేర్లు ఎన్ని మారినా ఇలాంటి ఉదంతాలలో అంతిమంగా బాధితులు మహిళలే. ప్రేమ అనేది భాష కంటే ముందునుంచే ఉన్న అపురూపమైన భావన. ఇది ఎన్నటికీ వసివాడని కుసుమం. ఇది ఎవరూ ఎవరికీ నేర్పించేది కాదు. ఇది స్వచ్ఛమైన మనసులో స్వచ్ఛందంగా పెల్లుబికే భావన. ప్రేమకు సరైన నిర్వచనం తెలీకపోవడమే నేడు మనం చూస్తున్న విషాద ఘటనలకు ప్రధాన కారణం. ప్రేమ చావుని కోరేది కాదు.. ప్రాణం పోసేదే నిజమైన ప్రేమ. అందుకే.. ఇకనైనా భారతీయ సమాజంలో వన్నె తగ్గుతున్న కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరమూ కనిపిస్తోంది. తల్లిదండ్రులు బాల్యం నుంచే కుటుంబ విలువలు, సంబంధాలతో బాటు మానవ సంబంధాలు, మానవ విలువల గురించి పిల్లలతో చర్చించాలి. సంప్రదాయాలు, ఛాంధస భావనల స్థానంలో హేతుబద్ధమైన, తార్కికమైన ఆలోచనలను పరిచయం చేయాలి. అప్పుడే ఈ అవాంఛిత ఘటనల నుంచి సమాజానికి విముక్తి లభిస్తుంది.
– డాక్టర్ నీలం సంపత్,
డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్స్‌పాల్, సామాజిక కార్యకర్త.
సెల్ 9866767471.