Big Stories

Ambati Rambabu vs Kanna Lakshmi Narayana : సత్తెనపల్లిలో గెలుపు సంబరాలు ఎవరివి ? సర్వేలో తేలిన నిజాలేమిటో ?

Ambati Rambabu vs Kanna Lakshmi Narayana : సత్తెనపల్లె అంటే ఠక్కున గుర్తొచ్చేది అంబటి రాంబాబు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన రూటే సెపరేటు. ఈ నియోజకవర్గంలో నెగ్గిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పార్టీ ఏదైనా.. కొన్నేళ్లుగా అదే విధానం సాగింది. గతంలో ఫ్యాన్ సునామీతో సునాయాసంగా గెలిచిన అంబటికి.. రాజకీయాల్లో తలపండిన కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలిచి సంబరాలు చేసేదెవరనే అంశం ఉత్కంఠగా మారింది.

- Advertisement -

2024 ఎన్నికలు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఛాలెంజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ నియోజవర్గంలో హేమాహేమీలు పోటీ పడ్డారు. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేయగా.. తెలుగుదేశం నుంచి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావటం సహా వాగ్దాటిలో కానీ.. రాజకీయాల్లోనూ ఇద్దరూ ఇద్దరే అనటంతో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరిదీ గుంటూరు జిల్లా అయినా.. నియోజకవర్గానికి మాత్రం ఇద్దరూ స్థానికేతరులే. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా.. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా.. రేపల్లె నియోజకవర్గం నుంచి అంబటి బరిలో నిలిచారు. దీంతో ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

- Advertisement -

సత్తెనపల్లిలో 1952,1955, 1962, 1967లో వరుసగా నాలుగుసార్లు.. వావిలాల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు. 1955లో సీపీఐ తరఫున.. మిగతాసార్లు స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన పోటీ చేయడం గమనార్హం. 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1983లో తెలుగుదేశం తొలిసారి గెలిచింది. 1985లో సీపీఐ, 1989లో కాంగ్రెస్, 1994లో సీపీఐ, 1999లో తెలుగుదేశం. ఈ నియోజకవర్గంలో గెలిచాయి. 2004, 2009లో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు గెలవగా.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి వచ్చి YCP అభ్యర్ధి అంబటి రాంబాబుపై 924 ఓట్ల నామమాత్రపు మెజారిటీతో గెలిచారు. 2019లో అంబటి రాంబాబు.. కోడెలను 20 వేలకు పైగా మెజారిటీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.

సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయపార్టీలో బలమైన విశ్వాసం. అక్కడ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటారు. ప్రస్తుతం నియోజకవర్గంలో YCP నుంచి అంబటి రాంబాబు గెలిచినా.. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచినా.. రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం ఖాయమనే చర్చ సాగుతోంది. దీంతో గట్టి పోటీనే ఇద్దరూ ఎదుర్కొన్నారనే వాదన ఉంది. ఇద్దరూ ప్రజలతో మమేకం అయ్యే నేతలు కావటంతో ఎవరు గెలుస్తారనే అంశం టెన్షన్‌గా మారింది. కొన్ని అంశాల వారీగా చూస్తే తమదే విజయమని టీడీపీ చెబుతుండగా..ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమను గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది. పైగా అంబటి రాంబాబు అంటే తెలుగురాష్ట్రాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత. ఆయన మాటలైనా.. డ్యాన్సులైనా.. ఏం చేసినా అదో సంచలనంగా మారుతుందని అనేది నిరూపితమైంది.

Also Read : పుష్ప పవర్ ఎంత? శిల్పా లెక్క మారిందా?

TDP తరఫున కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఇతర వ్యక్తి అయితే.. వైసీపీ విజయం తధ్యం అయ్యేదని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పైగా కూటమి తరపున.. కన్నా పోటీ చేయటంతో.. జనసేన, బీజేపీ పార్టీల ఓట్లు ఆయనకు కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన ఉంది. నియోజవర్గంలోని అనేక ప్రాంతాల్లో లక్ష్మీనారాయణకు బలమైన క్యాడర్ ఉంది. ఇది… ఆయన విజయానికి కలసి వస్తుందనే ధీమాతో టీడీపీ నేతలున్నారు. గతంలో మంత్రిగా అందించిన సేవలతో పాటు జనసేన, MRPS మద్దతు.. లక్ష్మీనారాయణకే ఉంది. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం.. టీడీపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరాం, మల్లిని కలుపుకుని పోవటం.. లక్ష్మీనారాయణకు కలసి వచ్చే అంశంగా మారుతుందనేది రాజకీయవర్గాల్లో టాక్‌.

కూటమిలో కొన్ని విభేదాలున్నా.. వాటిని పరిష్కరించుకోవడంలో లక్ష్మీనారాయణ సక్సెస్ అయ్యారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న కన్నా.. క్యాడర్‌కు కొన్నిరోజులు అందుబాటులో లేవనే విమర్శలూ వినిపించాయి. సత్తెనపల్లిలో కూటమికి భారీ మెజార్టీ ఖాయం అనుకున్న పరిస్థితుల నుంచి గెలిస్తే చాలు అనుకునే స్థాయికి క్యాడర్ వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో YCP అభ్యర్థి అంబటి రాంబాబుకి కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా.. టీడీపీకి కలిసివచ్చే అంశాలుగా మారవచ్చనే అంచనాతో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం, రెడ్డి సామాజికవర్గంతో పాటు కాపు సామాజకవర్గ ఓట్లు కూడా కలసి వస్తాయనే ధీమాలో వైసీపీ ఉంది. వైసీపీ హయాంలో జగన్‌ అమలు చేసిన పథకాలు తనకు శ్రీరామరక్ష అనే అంచనాతో రాంబాబు ఉన్నారట. పథకాలను అందుకున్న మహిళలంతా తమవైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే.. అంబటికి భారీ మెజార్టీ ఖాయమనే భావనలో వైసీపీ అధిష్టానం ఉందట.

నియోజకవర్గంలో కీలక ఓటుబ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరివైపు మళ్లాయనేది చర్చనీయాంశంగా మారింది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ ఉన్న అంబటి.. చాలాసార్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన వ్యవహారశైలితో పాటు పెళ్లిళ్ల అంశంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి పవన్ అభిమానులకు కోపం తెప్పించాయని.. తద్వారా ఆయా ఓట్లను అంబటి కోల్పోయారనేది టీడీపీ లెక్కగా తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబూచులాడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అంబటి మరోసారి సంబరాలు చేసుకుంటారా లేదా అనే మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News