Big Stories

YSRCP vs TDP in Hindupuram : టీడీపీ కంచుకోట హిందూపురం.. బాలయ్య హ్యాట్రిక్ కు వైసీపీ బ్రేక్ వేస్తుందా ?

YSRCP vs TDP in Hindupuram : టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ వేరే పార్టీకి చోటే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సినిమారంగంలో ఉండటమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లోనూ దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నా.. స్వయంగా ముఖ్యమంత్రి అభిమానించే నటుడాయన. ఈసారి ఆ స్థానాన్ని కైవసం చూసుకునేందుకు వైసీపీ అధిష్టానం వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఏళ్లుగా పాతుకుపోయిన టీడీపీను దూరం చేసేందుకు ప్రత్యర్థి పార్టీ ప్రణాళికలు ఏంటి ?

- Advertisement -

హిందూపురం.. టీడీపీకి మొదటి నుంచి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ తెలుగుదేశం హవా కొనసాగుతోంది. అలాగే నందమూరి కుటుంబానికి సెంటిమెంట్. ఇక్కడి నుంచి NTR.. తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. YCP ఆవిర్భావం, రాష్ట్ర విభజన తర్వాత హిందూపురం రాజకీయాలు చాలా మారిపోయాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచారు. హ్యట్రిక్ సాధించాలనే తపనతో ఈ నందమూరి అందగాడు ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురంలో YSRCP.. 2014, 2019లో అభ్యర్థుల్ని మార్చినా ఫలితం దక్కలేదు. వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఇక్బాల్‌పై సొంతపార్టీలోనే అసమ్మతి రేగింది. ఇంతలో చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య.. రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో YCP ప్లాన్ మార్చేసింది. ఈసారి మహిళా నేతను బరిలోకి దింపింది. హిందూపురం YCP అభ్యర్ధిగా దీపికను జగన్‌ ప్రకటించారు. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో అసలు కథ మొదలైంది.

- Advertisement -

హిందూపురంలో టీడీపీని ఢీకొట్టడం.. అందులోనూ నందమూరి నటసింహం బాలకృష్ణ ఓడించడం అంటే ఆషామాషీ కాదు. 30 ఏళ్లుకు పైగా అక్కడ తెలుగుదేశం పార్టీని టచ్ చేసిన దాఖలాలు లేవు. అంతలా ఈ నియోజకవర్గంలో టీడీపీకి పట్టుంది. అందులోనూ బాలయ్య లాంటి గట్టి అభ్యర్థిని ఓడించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. కానీ.. వైసీపీకి అంత సీన్‌ లేదనే విషయం ఇప్పటికే ఆ పార్టీ నేతలకు అర్థమైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. హిందూపురం వైసీపీలో మూడు గ్రూపులు.. ఆరువర్గాలుగా విడిపోయి ఎవరికివారే.. యమునా తీరన్న రీతిలో ఉన్నారనే ప్రచారం సాగింది.

Also Read : పలమనేరులో పాగా.. టీడీపీ కంచుకోటలో వైసీపీ పవర్ ఎంత?

హిందూపురంలో స్థానిక వైసీపీ నేత నవీన్ నిశ్చల్‌కు మంచి పేరుంది. గతంలో ఆయన.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయాడు. ఆ సానుభూతి కూడా ఉంది. కానీ.. నవీన్‌కు టికెట్ దక్కకపోవడంతో పార్టీపై ఆయన గుర్రమన్నారట. ఏదో రకంగా నవీన్‌ను వైసీపీ అధిష్టానం బతిమాలి దారిలోకి తెచ్చుకుందట. మరోనేత.. దివంగత చౌలురు రామకృష్ణారెడ్డి వర్గం కూడా జగన్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చెల్లెలు టికెట్ కోసం.. ఓ రేంజ్‌లో పోరాడి సైలెంట్ అయిపోయారు. వారు కూడా.. ఫ్యాన్‌ పార్టీ కోసం పెద్దగా పనిచేయలేదనే వాదనలు ఉన్నాయి.

బాలకృష్ణ ప్రత్యర్థి అయిన మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో బాలకృష్ణ తరపున ప్రచారం చేశారు. ముస్లిం వర్గంలో అంతో..ఇంతో పట్టున్న నేతను కూడా వైసీపీ చేజార్చుకుందనే టాక్ అప్పట్లో నడించింది. మున్సిపల్ ఛైర్మన్‌ ఇంద్రజ కూడా పార్టీలో అంటీముట్టనట్టు వ్యవహరించారట. తన భర్తను కేసుల్లో ఇరికించడంతో తప్పక సహకరించాల్సి వచ్చినా..లోలోపల అభ్యర్థి దీపికాకు మాత్రం సహకరించలేదనే ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణను ఓడించాలంటే పార్టీ మొత్తం కష్టపడి ఒకే తాటిపై పనిచేయాలని అధిష్టానం నచ్చచెప్పినా.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవని తెలుస్తోంది. హిందూపురంలో ఎవరికి వారే అన్నట్లు వైసీపీ నేతలు ఉండటంతో గెలుపు ఎలా అనే భావనలో ఫ్యాన్‌ పార్టీ శ్రేణులు ఉన్నారని సమాచారం.

తెలుగుదేశం ఆవిర్భావం తర్వత మూడు సార్లు గెలిచిన ఎన్టీఆర్ హిందూపురంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య కూడా 560 కోట్ల ఖర్చుతో.. 120 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి.. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీరు తీసుకువచ్చారు. అదే.. 2019 ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి దోహదం చేసిందనేది రాజకీయ నిపుణుల మాట.

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలోనూ బాలయ్య సొంత నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారట. తాగునీరు, హాస్పిటల్ అభివృద్ధి చేయడం, సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ నిర్వహించడంతో స్థానిక జనం జై బాలయ్య అంటున్నారట. హిందూపురంలో బాలకృష్ణ ఓడించడానికి మహిళకు టికెట్ ఇస్తే కొంత సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతోనే వైసీపీ అలాంటి వ్యూహాలు అనుసరించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నయా స్కెచ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News