YS Jagan Controversy: పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఉద్దేశమేంటి? క్యాడర్‌లో ధైర్యం నింపేందుకే ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి. వారితోనే సెల్యూట్ చేయిస్తానన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి.క్యాడర్‌లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత ఇలాంటి మాటలు అన్నా.. పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ.. జగన్.. క్యాడర్‌లో ధైర్యం నింపుతున్నారా.. లేక.. ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందే.. మళ్లీ చెబుతున్నారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇంతకీ… వైసీపీలో ఏం జరుగుతోంది?
ఎస్.. మీరు విన్నది నిజమే.. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి.. తర్వాత పరిణామాలతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న పాలన, తమ పార్టీ నేతలపై పెడుతున్న వరుస కేసుల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉందట. ఒక్కో జిల్లాపై సమీక్ష చేస్తున్న ఆ పార్టీ అధినేత జగన్.. పార్టీ నేతల్లో ఉత్తేజం కలిగించేందుకు యత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఓ వైపు జమిలి ఎన్నికలు వస్తే.. మళ్లీ మనదే అధికారం అని చెబుతూనే.. మరోవైపు.. ప్రస్తుత పరిస్థితులపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటనే వార్త.. హాట్ టాపిక్‌గా మారింది.
వరుసగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్.. ఆ పార్టీ క్యాడర్‌లో భరోసా నింపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత.. కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారట. మీపై తప్పుడు కేసులు పెట్టి ..కొట్టి .. హింసిస్తే .. పోలీసుల పేర్లు డైరీలో రాసుకోవావాలని… మన ప్రభుత్వం వచ్చాక.. వారితోనే మీకు సెల్యూట్ కొట్టిస్తానంటూ జగన్ అనటం హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కొక్కరితో మూడేసి నిమిషాలు మాట్లాడిన జగన్.. విడివిడిగా వారందరితో సెల్ఫీలు దిగి.. ఉత్సాహం నింపారట. అందులో భాగంగా శ్రేణులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
గత ఎన్నికల్లో కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చనందున.. శ్రేణులంతా పోరాటం చేయాలని జగన్.. పార్టీ శ్రేణులకు సూచించారట. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేందుకు జగన్ తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. జగన్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్.. ఊహించని విధంగా 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం సహా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించటంతో.. ఓటర్ల కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టారు.
Also Read: ఆ నియోజక వర్గంలో.. వైసీపీ పని అయిపోయినట్లే?
ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఓ కుదుపు వచ్చిందనే చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలూ పార్టీని వీడి…కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరటం.. ఉన్న వారు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవటంతో ఏం చేయాలో తెలియని స్థితిలోకి నేతలు వచ్చేశారట. అటు… కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ NDA ప్రభుత్వం ఉండటం సహా.. గతంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలపై కేసుల నమోదుతో క్యాడర్‌లో ఒకింత నైరాశ్యం వచ్చిందట. ఈ నేపథ్యంలో శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది.
గతంలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసిన వారిపై.. పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేసిన వారిపైనా కొరడా ఝులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ నిస్తేజంగా మారింటనే టాక్ నడుస్తోంది. ఈ సందర్భంలోనే జగన్..ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం.. పోలీసు వ్యవస్థను బెదిరించటమేననే వాదనలూ ఉన్నాయి. గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని.. టీడీపీ నేతలతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు.. నాడు తప్పు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. దాంతో క్యాడర్ అంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే కొందరు చెప్పుకుంటున్నారట. సో.. జగన్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ శ్రేణుల్లో ఎంతవరకూ భరోసా నింపుతాయనేది వేచి చూడాల్సిందే.