వైసీపీ 151 స్థానాల్లో గెలుపొంది 2019లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించింది. ఆ క్రమంలో గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఆ మూడు స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలూ చేసింది. ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడింది. అయినా మూడు చోట్లా వైసీపీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్టీ అధికారంలో ఉండి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, అరాచకాలు చేసి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. జగన్ మార్క్ రాజకీయాన్ని టీడీపీ ధీటుగా ఎదుర్కొన్ని ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా తయారైంది. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే కృష్ణా జిల్లా స్థానానికి గౌతంరెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ వర్గాలకే మింగుడుపడటం లేదంట. ఆ పార్టీ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా మతలబులే ఉన్నాయన్న చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఏడాది జరిగిన 3 పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ ఘోర పరాభవాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు . ఇప్పటికీ రెడ్ బుక్ జపమే చేస్తూ.. తర్వాత అధికారంలోకి వచ్చేది తానే అన్నట్లు పోలీసులకు వార్నింగులు ఇస్తున్నారు.
Also Read: కుప్పంలో వైసీపీ ఖాళీ.. టీడీపీలోకి కీలక నేతలు
ఓటమి తర్వాత వైసీపీ కూటమి ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా అయితే మారలేదు. దాంతో ఇప్పుడు పోటీ చేసినా, అసెంబ్లీ ఎన్నికల ఫలితమే పునరావృతమవుతుందని .. పోటీ నుంచి తప్పుకొంటే కనీసం పరువైనా దక్కుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీపై నిందలూ మోపవచ్చు. పైగా టీడీపీకి మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్‌నకు పరోక్షంగా దోహదపడొచ్చు. తద్వారా టీడీపీను దెబ్బకొట్టొచ్చు అనే యోచనతోనే ఎన్నికలను బహిష్కరించిందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
గతేడాది పట్టభద్రుల ఎన్నికల సమయంలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ.. ఇప్పుడు అధికార టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని, ఈ కారణంగా పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. జగన్ ఆ పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారి మధ్య చర్చ జరిగిందంట. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు, కాబట్టే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పడానకి ఫిక్స్ అయ్యారంట. సమావేశానంతరం మాజీ మంత్రి పేర్ని నాని అక్కడే మీడియా ముందుకొచ్చి అదే పల్లవి వల్లె వేశారు.
తర్వాత జగన్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి లేదని.. ఓటు వేసేందుకు ఓటర్లను తీసుకువచ్చే కార్యకర్తలపై దొంగ కేసులు పెడతారని.. ఇలా ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేనపుడు కార్యకర్తలను ఎందుకు ఇబ్బందుల పాల్జేయాలని ప్రశ్నిస్తూ ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 4 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి పోటీ చేసేందుకు సమర్ధులైన అభ్యర్ధులే దొరకడం లేదని.. అందుకే పలాయనం చిత్తగించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.