జగన పాలనలో ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదుల
జగన్ అయిదేళ్ల పాలనలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీనేతలు కబ్జా చేసేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల ద్వారా భూములను కైవసం చేసుకున్నారు. కొందరైతే నకిలీ పత్రాలు సృష్టించి తమ ఖాతాలో వేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలోనే దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్డంగా దొరికిపోయిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి
రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ భూముల ఆక్రమణలో అడ్డంగా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు. అక్కడ ఇంకా ఆకేపాటి కుటుంబ సభ్యుల్లో మరికొందరితో పాటు బినామీల పేరిట ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
పెద్దిరెడ్డి అక్రమాలపై తుది దశకు చేరుకుంటున్న విచారణలు
జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులై సీఎం రేంజ్లో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రభుత్వ భూముల్ని తమ సొంత జాగీరుల్లా మార్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాయలసీమ సీఎంలా వ్యవహరించిన పెద్దిరెడ్డి భూకబ్జాలపై ప్రస్తుతం విచారణలు తుది దశకు చేరుకుంటున్నాయి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసు పెద్దిరెడ్డి మెడకు గట్టిగానే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది.
జగన్ జమానాలో పెత్తనం చెలాయించిన సజ్జల
ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు హోదాలో జగన్ అధికారంలో ఉన్నంత కాలం చేసిన పెత్తనం అంతా ఇంతా కాదు. గత ప్రభుత్వంలో సజ్జలకి తెలియకుండా ఏమి జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. జగన్ కైనా కొన్ని తెలుస్తాయో లేదో తెలియదు కానీ.. సజ్జలకు తెలియకుండా రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగేది కాదంటారు.. అందుకే సజ్జల కాస్తా సకల శాఖ మంత్రి అనిపించుకున్నారు.
విచారణలో సజ్జల పేరే వెల్లడిస్తున్న నిందుతులు
ఇప్పుడు వైసీపీ నేతలపై పెడుతున్న ప్రతి కేసులో నిందితులు.. కర్త, కర్మ, క్రియ సజ్జల అని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలపై బూతుల పంచాంగం మొతమోగించిన వర్రా రవీంద్రారెడ్డిని కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి పేర్లే చెప్పాడు.. వారి ఆదేశాలు, సూచనల మేరకే తాను ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేశారని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
సజ్జల స్క్రిప్టులే చదివానంటున్న పోసాని
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ ప్రస్తుతం అరెస్టై ఎప్పుడు ఏ జైలులో ఉంటారో అంతుపట్టకుండా తిరుగుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబాలపై కూడా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్న పోసాని కృష్ణమురళీ.. పోలీసుల విచారణంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టులే తాను చదివానని, తన బూతుల దండకాన్ని సజ్జల భార్గవ్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేయించి వైరల్ చేయించాడని చెప్పి ఆ తండ్రి కొడుకుల్ని గట్టిగానే ఇరికించారు.
వెలుగు చూస్తున్న సజ్జల భూకభ్జా వ్యవహారాలు
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్నిట్లో వేలు పెట్టి చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్‌గా చేసిన భూకబ్జా వ్యవహారాలు కూడా ఇప్పుడు వెలుగుచూస్తునాయి. సజ్జఅ కుటుంబసభ్యులు అటవీ భూముల ఆక్రమణలపై లెక్క తేలుతోంది. ఆ భూములకు సంబంధించి గత కొద్ద రోజులుగా జరుగుతున్న రీ- సర్వేలో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సజ్జల ఫ్యామిలీ 53 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు తేలింది. ఫైనల్ రిపోర్టు తయారు చేసే పనిలో కడప జిల్లా యంత్రాంగం బిజీగా ఉంది.
సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద సజ్జల ఎస్టేట్
కడప జిల్లా సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద సజ్జల ఎస్టేట్ ఉంది. ఇందులో 146 ఎకరాల భూమిలో 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారనే అభియోగాలపై సర్వే చేస్తున్నారు. ఇందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న విచారణలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై చక్రం తిప్పిన సజ్జల.. ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా పోయారు.
ప్రత కేసులో సజ్జల పేరే చెప్తున్న నిందుతులు
గతంలో ఏ సమస్య పైన అయినా, ఏ శాఖకు సంబంధించి అయినా ప్రతిదీ సజ్జలే మాట్లాడేవారు. ఇప్పుడు సజ్జల తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా నోరు విప్పడం లేదు.. వైసీపీ నేతలపై పెడుతున్న కేసుల్లో ప్రతి నిందితుడు విచారణ సమయంలో సజ్జల పేరే చెప్పటం సంచలనంగా మారింది. సదరు వైసీపీ నేతలు తన పేరు వెల్లడించగానే సజ్జల కేసులు, అరెస్టు భయంతో హైకోర్టు తలుపుతడుతున్నాడు.
సజ్జల ఎస్టేట్‌లో 53 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తింపు
ఫలానా కేసులో తను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ హైకోర్టులో ముందస్తు బెనిఫిటేషన్ దాఖలు చేస్తున్నాడు. వైసిపి ఓటమికి కారకుడు సజ్జలే అని పరాజయం తర్వాత పలువురు వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు కేసులకు సంబంధించి కూడా సజ్జల పేరే ఫోకస్ అవుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. అదలా ఉంటే ఇడుపులపాయలో జగన్ ఎస్టేట్‌కు సంబంధించి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు వాగులు, వంకలు కూడా ఇడుపులపాయ ఎస్టేట్‌లో కలిపేసుకున్నారన్న ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం సిద్దమవుతోందంట. మొత్తానికి జగన్ పాలనలో ఆయనతో పాటు ఆయన కోటరీ చేసిన దందాలు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయిప్పుడు.