Stock Market: నేడు (ఏప్రిల్ 7, 2025న) భారత స్టాక్ మార్కెట్లకు రక్త కన్నీటి రోజుగా నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర పతనాన్ని చవిచూడగా, భారత మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో నిఫ్టీ, సెన్సెక్స్ సహా సూచీలు మొత్తం ప్రారంభ ట్రేడింగ్ నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సూచీల పతనం
నిఫ్టీ 50 – 1,160.8 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరుకుంది. ఇది గత 12 నెలల్లో అతిపెద్ద పతనం. BSE సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 స్థాయికి చేరుకుంది. ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదు. ఇవి పెట్టుబడిదారుల భవిష్యత్తుపై ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తున్న సంకేతాలని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే 40 లక్షల కోట్లకుపైగా నష్టపోయారు.
ఇండియా VIX – భయ సూచిక
భారత మార్కెట్లలో అస్థిరత స్థాయి గణనీయంగా పెరిగింది. నిఫ్టీ అస్థిరతను కొలిచే ఇండియా VIX 56.5% పెరిగి 21.53కి చేరుకుంది. ఇది భవిష్యత్తులో మరింత ఒత్తిడికి సంకేతమని చెప్పవచ్చు.
Read Also: YouTube Shorts: యూట్యూబ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్..ఏఐ …
పెద్ద కంపెనీలు కూడా రక్షించుకోలేకపోయాయి
ఈరోజు ట్రేడింగ్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్ 10%కి పైగా పతనమయ్యాయి. అదనంగా, లార్సెన్ & టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్,
టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా వంటి దిగ్గజాలు కూడా మార్కెట్ పతనానికి తలొగ్గాయి.
ప్రపంచం నుంచి వచ్చే టారిఫ్ టెర్రర్
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆగ్నేయాసియా దిగుమతులపై భారీ టారిఫ్‌లు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ట్రేడింగ్ వాతావరణాన్ని అస్థిరం చేశాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, పెరిగిన బాండ్ యీల్డ్స్, అనిశ్చిత భవిష్యత్తు కారణంగా పెట్టుబడిదారులు రిస్క్ నుంచి దూరంగా ఉండాలని చూస్తున్నారు.
గతంలో కూడా ఇదే తరహా పతనాలు
అయితే స్కాక్ మార్కెట్ పతనం ఇది మొదటిసారి కాదు. మన మార్కెట్ గతంలోనూ ఎన్నో సార్లు భీకర పతనాలను ఎదుర్కొంది. అందులో కొన్ని కీలకమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. హర్షద్ మెహతా స్కామ్ (1992)
ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ ఒక్కరోజులో 570 పాయింట్లు (-12.7%) పడిపోయింది. భారత మార్కెట్ చరిత్రలో ఇది ఒక సంచలనాత్మక స్కాం.
2. కేతన్ పరేఖ్ స్కామ్ (2001)
మార్చి 2, 2001: సెన్సెక్స్ 176 పాయింట్లు (-4.13%) పడిపోయింది. ఇది టెక్ స్టాక్స్ పై మానిప్యులేషన్ చేసిన దానికి ప్రతిఫలంగా వచ్చింది.
3. ఎన్నికల షాక్ (2004)
మే 17, 2004: UPA ఊహించని విజయం తర్వాత మార్కెట్ 11.1% పడిపోయింది. రాజకీయ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు భయంతో షేర్లను అమ్మేశారు.
4. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (2008)
జనవరి 21, 2008: ప్రపంచ మాంద్యం భయాలతో, FII అమ్మకాలతో సెన్సెక్స్ 1,408 పాయింట్లు (-7.4%) పతనమైంది.
5. కోవిడ్-19 పతనం (2020)
మార్చి 23, 2020: లాక్‌డౌన్ ప్రకటన తర్వాత మార్కెట్ 3,935 పాయింట్లు (-13.2%) పతనమైంది. ఇది మన చరిత్రలో అతిపెద్ద ఒక్కరోజు పతనం.
పెట్టుబడిదారులకు సూచన
ఈ తరహా మార్కెట్ పతనాలు భయం కలిగించినా, అవి ముందస్తు అవకాశం కావచ్చు. కొన్ని మేధావులు దీన్ని “Buying Opportunity”గా కూడా చూస్తారు. అయితే, జాగ్రత్తగా ప్లాన్ చేయాలని చెబుతున్నారు.
-ఈ సమయంలో చేయవలసినవి: పానిక్ సెల్లింగ్‌కు దూరంగా ఉండండి. మార్కెట్ తాత్కాలికంగా పడిపోతే, బలమైన స్టాక్స్ తిరిగి మళ్లీ బలపడతాయి.
-పోర్ట్‌ఫోలియో రివ్యూ చేయండి. అవసరమైన చోట షిఫ్ట్ చేయండి. నష్టాల్లో ఉన్న స్టాక్స్ హోల్డ్ చేయాలా లేదా అనేదాన్ని పునఃపరిశీలించండి. లాంగ్‌టెర్మ్ దృక్పథం పెట్టుకోండి. మార్కెట్ ఓవర్‌టైమ్ పునరుద్ధరమవుతుందనే విశ్వాసంతో ఉండాలి.
తిరిగి లేవడం పక్కా
ఈరోజు మార్కెట్ పతనం మనకు ఒక గుణపాఠం చెప్తోంది. అంతర్జాతీయ అనిశ్చితి మన మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తుందో. కానీ, గతం చూస్తే తెలిసిపోతుంది. మార్కెట్ ఎన్నిసార్లు పడినా, తిరిగి లేచి నడిచింది. సమయానికి సరైన వ్యూహాలతో, పెట్టుబడిదారులు కూడా అదే చేస్తారు.