Rising expenses in India| నెల ప్రారంభంలో జీతం చేతికి వచ్చినా, నెలాఖరుకు డబ్బులు మిగలడం లేదా? కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలే దీనికి కారణమని అనుకుంటే మీరు పొరబడినట్లే. అందుకే ఒక్కసారి మీ ఖర్చుల జాబితాను పరిశీలించండి. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దాటడంతో సామాన్య కుటుంబాల బడ్జెట్‌పై మరింత భారం పడుతోంది.
భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ 2026లో 6.09 శాతానికి చేరింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితిని దాటింది. ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతంగా నమోదైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవల ధరలు ఏడాదిలో 10.06 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 10.24 శాతంగా, పట్టణాల్లో 9.90 శాతంగా ఉంది. బయట భోజనం చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా ఖరీదవుతోంది.
సబ్బు, టూత్ పేస్ట్, షాంపూ లాంటి పర్సనల్ కేర్, ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంలు లాంటి ఇతర సేవల విభాగంలో ధరలు 10.14 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 10.84 శాతంగా నమోదైంది. పట్టణాల్లో 9.24 శాతంగా ఉంది. రోజువారీ అవసరాల కోసం కూడా కుటుంబాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.74 శాతం ఉండగా, అక్టోబర్‌లో 8.94 శాతానికి పెరిగింది. ఉల్లి ధరలు ఏడాదిలో ఏకంగా 116.22 శాతం పెరిగాయి. వెల్లుల్లి ధరలు 60.74 శాతం, అల్లం ధరలు 48.32 శాతం అలాగే నిమ్మకాయల ధరలు కూడా 47.30 పెరిగాయి.
అయితే ఈ నెలలో కొన్ని కూరగాయల ధరలు తగ్గాయి. బంగాళాదుంపలు 14.24 శాతం, కాలీఫ్లవర్ 10.57 శాతం చౌకయ్యాయి. కొబ్బరి ధరలు 5.60 శాతం తగ్గాయి.
Also Read: పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..
రవాణా రంగంలో ద్రవ్యోల్బణం 5.84 శాతంగా నమోదైంది. వ్యక్తిగత వాహనాల నిర్వహణ ఖర్చులు 7.52 శాతం పెరిగాయి. సరుకు రవాణా సేవల ధరలు 7.34 శాతం పెరిగాయి. ప్రయాణికుల రవాణా సేవల్లో 4.02 శాతం పెరుగుదల నమోదైంది. ముడి చమురు ధరలు అధికంగా కొనసాగితే ఇంధన ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దుస్తులు, పాదరక్షల ధరలు 4.96 శాతం పెరిగాయి. గృహోపకరణాలు, ఫర్నిచర్ ఖర్చుల్లోనూ పెరుగుదల కనిపించింది. గృహ వినియోగ వస్తువుల ధరలు 7.10 శాతం, ఫర్నిచర్ ధరలు 5.39 శాతం పెరిగాయి.
Also Read: పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే
విద్యా సేవల ధరలు 4.02 శాతం పెరిగాయి. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 2.05 శాతంగా ఉంది. ఇంటి అద్దెల పెరుగుదల 2.36 శాతంగా నమోదైంది.
ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరలు కాలక్రమంలో పెరగడం. అక్టోబర్‌లో నమోదైన 6.09 శాతం ద్రవ్యోల్బణం ప్రతి వస్తువు అంతే శాతం పెరిగిందని అర్థం కాదు. అయితే ఆహారం, రవాణా, ఇతర రోజువారీ ఖర్చులు పెరగడంతో నెలవారీ మీ కుటుంబ సేవింగ్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆదాయంలో ఎక్కువ భాగం నిత్యావసరాల కోసం ఖర్చు చేసే కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.