Universal Basic Income| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని విధానాన్ని వేగంగా మార్చేసింది. AI అనేక రకాలుగా ఉపయోగకరం, కానీ ఇది ఉద్యోగాలను కూడా నాశనం చేసే అవకాశం ఉంది. కోడింగ్, రాయడం, టీచింగ్, వీడియో తయారీ వంటి పనులను AI సాధనాలు మానవుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలవు.
2023 ఏప్రిల్‌లో గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, AI వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. విశ్లేషకులు, మార్కెటర్లు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల వంటి ఉద్యోగాలు యంత్రాలు సునాయసంగా నిర్వహించే అవకాశం ఉంది.
చాట్‌జీపీటీ వంటి AI మోడల్‌లు కోడింగ్ టెస్ట్‌లలో డెవలపర్లను మించిపోతున్నాయి. ఇమెయిల్‌లు, దీర్ఘ వ్యాసాలను క్షణాల్లో రాయగలవు. రన్‌వే, సోరా, గూగుల్ VEO 3 వంటి AI సాధనాలు టెక్స్ట్ ఆధారంగా వీడియో సన్నివేశాలను సృష్టిస్తున్నాయి. మీ ఉద్యోగం సంఖ్యలు, నమూనాలు లేదా పదాలపై ఆధారపడి ఉంటే, AI దాన్ని త్వరగా ఆక్రమించవచ్చు. అలా జరిగితే, ఉద్యోగం, ఆదాయం కోల్పోతే పరిస్థితి ఏంటి?. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యుబిఐ ఒక టూరటలాంటిది. మరో ఉద్యోగం లభించేంత వరకు ఉద్యోగికి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
UBI అనేది ప్రతి పౌరుడికి ప్రభుత్వం నుండి నిర్దిష్ట మొత్తం డబ్బును క్రమం తప్పకుండా అందించే ఆర్థిక విధానం. ఇది షరతులు లేనిది—ధనవంతులైనా, పేదవారైనా, ఉద్యోగం ఉన్నవారైనా, లేనివారైనా అందరికీ సమానంగా డబ్బు అందుతుంది. UBI ద్వారా ప్రజలు ఆహారం, గృహం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఇది సరళమైన, న్యాయమైన, సార్వత్రిక విధానం.
టెక్ నాయకులు UBIని ఎందుకు సమర్థిస్తున్నారు?
AI వల్ల భారీగా ఉద్యోగాలు కోల్పోతారని టెక్ బిలియనీర్లు భావిస్తున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఒక మూడేళ్ల UBI అధ్యయనాన్ని సమర్థించారు, ఇందులో పాల్గొన్నవారు నెలకు $1,000 చొప్పున 36 నెలల పాటు పొందారు. యుబిఐ ద్వారా అందించే డబ్బు ఎక్కువగా ఆహారం.. గృహ ఖర్చులు, బిల్లుల కోసం వినియోగించబడింది. పాల్గొన్నవారు కొంచెం తక్కువ పనిచేసినప్పటికీ.. వారి జీవనం మెరుగుపడింది.
ఎలాన్ మస్క్ UBI ద్వారా “స్టార్ ట్రెక్ ఫ్యూచర్” సాధ్యమని, అందరూ సంతోషంగా, సమృద్ధిగా జీవించవచ్చని చెప్పారు. కానీ, సరిగ్గా అమలు చేయకపోతే “టెర్మినేటర్ ఫ్యూచర్” రావచ్చని హెచ్చరించారు. సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్, తమ కంపెనీలో సగం పనిని AI చేస్తోందని, UBI ద్వారా ఉద్యోగం లేని వారు, ముఖ్యంగా పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు ఉన్నవారు లబ్ధి పొందవచ్చని చెప్పారు.
UBI ఎలా అమలు చేయవచ్చు?
ఫిన్‌లాండ్, కెనడా, అమెరికాలోని కొన్ని నగరాల్లో UBI ప్రయోగాలు జరిగాయి. మంచి ఫలితాలు కనిపించాయి. UBI ఒత్తిడిని తగ్గించి, జీవనాన్ని మెరుగుపరిచింది. అయితే ప్రజల్లో సోమరితనం కూడా పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (CBDCs) ద్వారా ప్రభుత్వాలు UBIని అందించవచ్చు. భారత్‌లో డిజిటల్ రూపీ వంటి CBDCలు నగదులాగా ఉపయోగపడతాయి. కానీ ప్రభుత్వం విధించే ఖర్చుకు పరిమితులు ఉండవచ్చు.
భారత్‌లో UBI భవిష్యత్తు
ఆటోమేషన్ వల్ల భారత్‌లో ఉద్యోగ నష్టం జరిగితే, డిజిటల్ రూపీ ద్వారా UBI అమలు చేయవచ్చు. అయితే, ఈ UBIకి నిధులు ఎవరు సమకూరుస్తారు మరియు ప్రభుత్వం దానిపై ఎంత నియంత్రణ విధిస్తుందనేది నిర్ణయించాలి.