Air India Loss Pakistan Ban| భారతదేశం, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ప్రస్తుతం భారతీయ కంపెనీలపై పడింది. ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్ల పతనంపై చర్చ ఒకవైపు నడుస్తూనే ఉండగా.. ఇప్పుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సంస్థలలో ఒకటైన ఎయిర్ ఇండియా గురించి చర్చ జరుగుతోంది.
ఒక సంవత్సరంపాటు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేస్తే, ఎయిర్ ఇండియాకు ఏటా రూ. 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని రాయిటర్స్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఈ నష్టాన్ని ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించిందని రాయిటర్స్ వెల్లడించింది. ఆ లేఖను తాము చూశామని, చదివినట్లు కూడా రాయిటర్స్ సంస్థ ధృవీకరించింది.
రూ. 50 వేల కోట్ల నష్టం అంచనా
పాకిస్తాన్ వైమానిక గగనతలంపై నిషేధం ఒక సంవత్సరం కొనసాగితే, ఎయిర్ ఇండియాకు దాదాపు 600 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 5,400 కోట్లు) అదనపు ఖర్చులు పడతాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల కాశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేసింది. దాంతో భారత సంస్థలు పొడవైన ప్రయాణాలు చేయాల్సి వస్తోంది, తద్వారా ఇంధన ఖర్చులు మరియు నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ కోరిన ఎయిర్ ఇండియా
ఏప్రిల్ 27న ఎయిర్ ఇండియా తన ఆర్థిక నష్టం గురించి భారత ప్రభుత్వాన్ని తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో, సంస్థ ఏడాదికి రూ. 5 వేల కోట్లకు పైగా నష్టాన్ని ఎదుర్కొంటుందని పేర్కొంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి ప్రభావిత అంతర్జాతీయ విమానాలకు సబ్సిడీ కల్పించవచ్చని సూచించింది. పరిస్థితులు మెరుగైతే సబ్సిడీని తొలగించవచ్చని పేర్కొంది. గగనతల నిషేధం వల్ల విమానాశ్రయాల మూసివేత, అధిక ఇంధన వినియోగం, అదనపు సిబ్బంది అవసరం వల్ల సంస్థ ఎక్కువగా నష్టపోతుందని పేర్కొంది.
Also Read: ఇండియా పాక్ ఉద్రిక్తత .. వివాహాలు రద్దు.. కుటుంబాలు విలవిల
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఎయిర్ ఇండియా ఈ అంశంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా దీనిపై స్పష్టత కోరగా.. ఆ అభ్యర్థనఫై ఎయిర్ ఇండియా స్పందించలేదు. భారత విమానయాన సంస్థలపై గగనతల నిషేధం వల్ల పడే ప్రభావాన్ని అంచనా వేయమని అధికారులను ప్రభుత్వం కోరిన అనంతరం ఎయిర్ ఇండియా ఈ లేఖను పంపినట్లు సమాచారం. టాటా గ్రూప్ చేత యాజమాన్యం చేపట్టిన ఈ సంస్థ గతంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేది. ప్రస్తుతం బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుండి విమానాల డెలివరీల్లో ఆలస్యం కారణంగా సంస్థ అభివృద్ధి ప్రభావితమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి సుమారు 520 మిలియన్ల డాలర్ల నష్టం వచ్చినట్లు తెలిసింది.
మార్కెట్‌లో ఎయిర్ ఇండియా వాటా
భారతదేశంలో సుమారు 26.5 శాతం మార్కెట్ వాటా కలిగిన ఎయిర్ ఇండియా.. యూరప్, అమెరికా, కెనడా వంటి దేశాలకు విమాన సర్వీసులు అందిస్తోంది. ఈ మార్గాల్లో తరచూ పాకిస్తాన్ గగనతలాన్ని దాటి ప్రయాణిస్తుంది. దీని కారణంగా, ఇండిగో వంటి దేశీయ పోటీదారులతో పోలిస్తే చాలా ఎక్కువ సుదూర మార్గాల్లో ఈ సంస్థ నడుస్తోంది. సిరియం అసెండ్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా, దాని బడ్జెట్ విభాగం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో కలిసి 2024 ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలకు సుమారు 1,200 విమానాలను షెడ్యూల్ చేశాయి.
చైనాతో మద్దతు కోసం ఎదురు చూపులు
పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసిన ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విమానాల కోసం చైనా సమీపంలో ఉన్న క్లిష్ట ప్రాంతాల్లో ఓవర్‌ఫ్లైట్స్ నిర్వహించే అవకాశాలు, పన్ను మినహాయింపులు వంటి పరిష్కారాలపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో భారత విమానయాన సంస్థలు సమావేశమయ్యాయని సమాచారం. అలాగే, కొన్ని ఓవర్‌ఫ్లైట్ అనుమతుల కోసం చైనా అధికారులతో సంప్రదింపులు జరపాలని ఎయిర్ ఇండియా తన లేఖలో ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే, దానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అమెరికా, కెనడాకు వెళ్లే విమానాల్లో అదనపు పైలట్లు నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఎయిర్ ఇండియా కోరినట్లు తెలుస్తోంది.