Gold Loans: ఇటీవల కాలంలో బంగారం రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది బంగారం ధరలు నిరంతరం పెరగడంతోపాటు గోల్డ్ లోన్స్ తీసుకోవడం చాలా సులభం. మరోవైపు దీనిపై వడ్డీ రేటు కూడా తక్కువగా ఉండటంతో అనేక మంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అంతేకాదు పలువురు తక్కువ వడ్డీకి డబ్బు తీసుకుని, పలువురికి ఎక్కువకు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొంత మంది మాత్రం వారి ఆర్థిక అవసరాల కోసం తీసుకుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో ఉంచిన బంగారాన్ని ఉపయోగించి లోన్స్ తీసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తారు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయని తెలుస్తోంది.
బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావిస్తోంది. కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అనుసరించాలని, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలని బంగారు రుణ రుణ సంస్థలను RBI ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) బంగారు రుణ గ్రహీతలపై తనిఖీలను పెంచాలని ఆర్‌బీఐ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తాకట్టు పెట్టిన బంగారం యజమానులు వారేనా కాదా అనే ఖచ్చితమైన సమాచారాన్ని పొందాలని RBI ఆయా సంస్థలకు సూచించినట్లు తెలిసింది.
Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళల భద్రత కోసం టాప్ 5 యాప్స్
సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటివరకు బ్యాంకుల బంగారు రుణ రేటు 50 శాతానికి పెరగడం విశేషం. దీంతో బంగారు రుణ రంగంలో వృద్ధి హద్దులు దాటకుండా, సంస్థలు ఒక ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించాలని RBI భావిస్తోంది. ఆర్‌బీఐ అనైతిక వ్యాపార పద్ధతులను అరికట్టడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బంగారు రుణ నిబంధనలను మరింత కఠినతరం చేయవచ్చని ఆయా వర్గాలు అంటున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్‌లో బంగారు రుణాలలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. రుణ సోర్సింగ్, బంగారం విలువను అంచనా వేయడంలో లోపాలను పసిగట్టింది. ఆ క్రమంలో నియంత్రణ లోపాలను గుర్తించి పరిష్కరించడానికి వారి రుణ ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించాలని రుణదాతలను కోరింది. అన్ని సంస్థలు ప్రామాణిక నిబంధనలను పాటించడం లేదని ప్రస్తావించింది. గత 12 నుంచి 16 నెలలుగా నిర్వహించిన ఆడిట్‌లలో సెంట్రల్ బ్యాంక్ NBFC రుణదాతల పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు, బంగారం తాకట్టు పెట్టిన రుణ మొత్తాలను పర్యవేక్షించడంలో అనేక లోపాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
పలు సందర్భాలలో రుణం తిరిగి చెల్లించని రుణగ్రహీతలకు తెలియజేయకుండానే పలు సంస్థలు బంగారాన్ని వేలం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బంగారం వేలం, రసీదుల ద్వారా అప్పుగా ఇచ్చిన డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం సహా, ఏ సంస్థ కూడా నిబంధనలను అతిక్రమించకుండా చూసుకోవడానికి బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రుణదాతలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఫిన్‌టెక్ ఏజెంట్లు బంగారాన్ని సేకరించడం, తనిఖీ చేయడం, నిల్వ చేయడం, తూకం వేసే క్రమంలో సరైన నిబంధనలు పాటించే అవకాశం ఉంది.