Ranya Rao Gold Smugling| కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. రన్యారావు బంగారం అక్రమ రవాణా వెనుక ఒక రాజకీయ నాయకుడి చేయి ఉందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యాయ సలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రన్యారావు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమె ఇంట్లో సోదా చేస్తే భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఈ బంగారం ఎవరిదో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బంగారాన్ని ఒక రాజకీయ నాయకుడు కొనుగోలు చేసినట్లు అనేక ఆధారాలు బయటపడ్డాయి. అంటే రన్యారావు ఆ రాజకీయ నాయకుడి కోసమే పనిచేస్తోంది.
రన్యారావుతో కలిసి ఈ రాజకీయ నాయకుడే అక్రమ రవాణా చేయించినట్లు DRI అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు, రన్యారావు మధ్య ఒప్పందం జరిగిందని, దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తే కిలోకు లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం, నటి ఒకే సంవత్సరంలో దుబాయ్‌కు 30 సార్లు వెళ్లింది. ప్రతి ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం DRI అధికారులు బంగారం కొనుగోలు సంబంధిత రసీదులను సేకరిస్తున్నారు.
మరోవైపు రన్యారావు బంగారం అక్రమ రవాణా విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యాయ సలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు. నటి రన్యారావు వెనుక ఎటువంటి రాజకీయ శక్తులున్నా.. వాటితో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో బయటపడుతుందని చెప్పారు. రన్యారావు వెనుక ఒక రాజకీయ నాయకుడున్నాడని తమకు తెలిసిందన్నారు.
Also Read: సహజీవనం చేశాక.. అత్యాచారం జరిగిందంటే కుదరదు!
అరబ్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి, ఒక డీజీపీ బంధువు రన్యారావు విచారణలో డొంక తిరుగుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29 కోట్ల విలువైన బంగారం మరియు నగదును జప్తు చేశారు. ఈమె దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో పట్టుబడింది. అప్పటి నుంచి ఆమెను DRI అధికారులు విచారణ చేస్తన్నారు.
బంగారం దాచడానికి ఖరీదైన ఇల్లు
బెంగళూరు లవెల్లీ రోడ్‌లోని నందవాణి మ్యాన్షన్‌లో నటి రన్యారావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తోందని తెలిసింది. ఆ ఇంట్లో సోదాలు చేస్తే బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు దొరికాయి. మంగళవారం నుంచి సోదాలు చేసి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా దొరికింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువైన ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని DRI ప్రకటించింది.
రన్యారావుకు 14 రోజుల రిమాండ్
ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్యారావును హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లోని DRI కేంద్ర కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం అక్రమ రవాణాలో కొందరు పోలీసులు మరియు పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దుబాయ్‌కు పదే పదే టూర్లు
నటి రన్యారావు తరచుగా దుబాయ్‌కు వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువస్తోంది. కస్టమ్స్, భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా తన తండ్రి డీజీపీ రామచంద్రరావు పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచుగా దుబాయ్‌కు వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకువస్తోందని, దీని వెనుక పెద్ద ముఠా ఉండవచ్చని DRI అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల విచారణలో డిజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. తన భార్యకు మొదటి భర్త సంతానమని.. ఆమెతో తనకు ఏ సంబంధం లేదన్నారు. ఆమె నాలుగు నెలల క్రితం జతిన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుందని.. అంతకుమించి తనకు ఏమీ తెలియదన్నారు.
బంగారం ఎక్కడ దాచేదంటే?..
విమానం దిగగానే రన్యారావును DRI అధికారులు తనిఖీ చేస్తే గుట్టు బయటపడింది. 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకదని ఆమె అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్ అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్యారావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధని యఘ్నేశ్, మాణిక్య సినిమా సమయంలో రన్యారావుగా పేరు మార్చుకుంది.
ఒక్కొక్కరు ఎంత బంగారం తీసుకురావచ్చు?
దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు.
పురుషులు 50 గ్రాములు తీసుకువస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజు చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం, 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజు చెల్లించాలి.
మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుము చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వసూలు చేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి.