Earphone Riding: ఈ రోజుల్లో రోడ్డుపై ద్విచక్రవాహనం నడిపేటప్పుడు చెవిలో ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ప్రయాణంలో పాటలు వినడమనేది.. కొందరికి ఒక ఎంటర్ టైన్ మెంట్ కావొచ్చు. కానీ ఈ అలవాటు వారితో పాటు రోడ్డుపై వెళ్లే మిగతావారిని సైతం ప్రమాదంలోకి నెట్టొచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ నడపడం వల్ల రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మన దృష్టితో పెట్టు, చెవులు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ వెళ్తే.. వెనుక నుంచి వచ్చే వాహనాల హార్న్ శబ్దాలు, అంబులెన్స్ సైరన్లు వినిపించవు. అంతేకాకుండా ఒక్కోసారి పక్క వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే ఎమర్జెన్సీ వార్నింగ్స్ సైతం చెవిన పడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భారీ ప్రమాదాలు జరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే జీవితాంతం బాధపడాల్సిందేనని పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. ఇయర్ ఫోన్లు పెట్టుకొని బైక్ లేదా స్కూటర్ నడపడం ముమ్మాటికీ తప్పే. ఇలా చేయడాన్ని ‘డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్’ (ఏకాగ్రత లేని డ్రైవింగ్) గా ట్రాఫిక్ పోలీసులు పరిగణిస్తారు.అటు మోటార్ వాహనాల చట్టం ప్రకారం కూడా ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ నడుపుతూ పట్టుబడితో భారీగా చలానాలు విధించే హక్కు పోలీసులకు ఉంటుంది. మెుదటిసారి అలా దొరికితే ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రూ.1,000 నుండి రూ. 2,000 వరకు జరిమానా విధిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ ఫైన్ రూ.5,000 వరకు ఉంది. అయితే జరిమానా విధించిన తర్వాత కూడా ఇదే తప్పు రిపీట్ గా చేస్తూ పట్టుబడితే.. డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.
Also Read: హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!
అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ పైన వెళ్లేవారు కొన్ని బేసిక్ విషయాలను మర్చిపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. పాటల కంటే ప్రాణం ఎంతో విలువైందన్న ప్రాథమిక సూత్రాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రతను దెబ్బతీసే ఎలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. సేఫ్ గా ఇంటికి చేరక పాటలు వింటారో.. సినిమాలు చూస్తారో మీ ఇష్టమని స్పష్టం చేస్తున్నారు.
Also Read: విశాఖ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లు!