Bisleri Water Controversy: బిస్లెరీ నీటి నమూనాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ భారత ఆహార భద్రత సంస్థ (FSSAI) చేసిన హెచ్చరికపై సదరు సంస్థ స్పందించింది. తమ ఉత్పత్తులు వినియోగానికి పూర్తిగా సురక్షితమైనవేనని స్పష్టం చేసింది. తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని.. కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దశాబ్దాలుగా ప్రజల విశ్వాసం పొందిన బిస్లెరీ నీరు.. తాగడానికి ముమ్మాటికీ సురక్షితమే అని బిస్లెరీ ప్రకటించింది.
తాజా ఆరోపణలపై కూడా బిస్లెరీ సంస్థ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. దేశంలోని 143 ప్లాంట్లలో ఒకటైన గోవా తయారీ కేంద్రంలో ఈ ఆరోపణలు వచ్చినట్లు పేర్కొంది. అది కూడా గతేడాది సెప్టెంబర్ లో ఉత్పత్తి చేసిన ఒకే ఒక్క బ్యాచ్ కు సంబంధించి పరీక్షలు జరిగాయని తెలిపింది. అయితే తాజా ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఎలాంటి అధికారిక నోటీసు అందలేదని ప్రకటనలో చెప్పుకొచ్చింది.
https://t.co/qOBmfxcYj9
— BisleriZone (@BisleriZone) November 23, 2026
2025 సెప్టెంబర్ 30న గోవా ప్లాంట్ నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరు నమూనాలను సేకరించిందని బిస్లెరీ గుర్తుచేసింది. ప్రాథమిక పరీక్షల్లో ఐదు నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తేలిందన్నది. 6వ నమూనాలో మాత్రం బ్రోమేట్ (Bromate) స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు చెప్పింది. నిర్ణీత పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు మాత్రమే కాగా 2 మైక్రో గ్రాములు ఎక్కువ చూపించిందని బిస్లెరీ తెలిపింది. అయితే రిఫరల్ ల్యాబొరేటరీ పరీక్షలో బ్రోమేట్ స్థాయి నిర్దేశించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని చెప్పింది. కానీ అదే నమూనాలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు వేరేగా గుర్తించారని చెప్పుకొచ్చింది.
Also Read: బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!