Tata Steel Deal: దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ (Tata Steel) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలోని ట్యూబ్స్, పైప్స్ వ్యాపార విభాగంతో పాటు ‘టాటా స్టీల్ కలర్స్’లోని పూర్తి వాటాను ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ (APL Apollo Tubes) కు విక్రయించేందుకు టాటా స్టీల్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ. 28,000 కోట్ల విలువైన ఈ మెగా డీల్‌కు నవంబర్ 22న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించినట్లు స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఫైలింగ్ లో టాటా సంస్థ వెల్లడించింది.
అయితే ఈ భారీ విక్రయ ప్రక్రియ ప్రధానంగా రెండు భాగాలుగా జరగనుంది. మొదటి భాగంలో టాటా స్టీల్‌కు చెందిన ట్యూబ్స్, పైప్స్ వ్యాపారాన్ని రూ. 11,700 కోట్ల వరకు వెచ్చించి ఏపీఎల్ అపోలో కొనుగోలు చేయనుంది. రెండో భాగంలో టాటా స్టీల్ కలర్స్‌లో ఉన్న 100 శాతం వాటాను రూ. 16,300 కోట్లకు దక్కించుకోనుంది.
ట్యూబ్స్, పైప్స్ వ్యాపార బదిలీ ‘స్లంప్ సేల్’ (Slump Sale) పద్ధతిలో జరగనుంది. అంటే ఈ విభాగానికి చెందిన ఆస్తులు, కార్యకలాపాలన్నీ ఒకేసారి బదిలీ కానున్నాయి. జంషెడ్‌పూర్ (Jamshedpur), హోసూర్, ఖోపోలీ, సాహిబాబాద్‌లలోని తయారీ కేంద్రాలతో పాటు ఖోపోలీలోని కొన్ని కోల్డ్ రోలింగ్, సర్ఫేస్-కోటెడ్ స్టీల్ యూనిట్లు ఏపీఎల్ అపోలో సొంతం కానున్నాయి. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం సుమారు రూ. 11,375 కోట్ల టర్నోవర్ సాధించింది. టాటా స్టీల్ మొత్తం ఆదాయంలో దీని వాటా 4.9 శాతంగా ఉంది.
మరోవైపు ‘టాటా స్టీల్ కలర్స్’కు సంబంధించి.. టాటా స్టీల్‌కు 50 శాతం, దాని అనుబంధ సంస్థ టాటా స్టీల్ డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TSDPL) వద్ద మిగిలిన 50 శాతం వాటా ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ఏపీఎల్ అపోలో చెల్లించే రూ. 16,300 కోట్లలో టాటా స్టీల్‌కు రూ. 8,150 కోట్లు, TSDPLకు మరో రూ. 8,150 కోట్లు సమానంగా దక్కనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 4,680 కోట్ల ఆదాయంతో పాటు రూ. 85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Also Read: తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!
తమ వ్యాపార పోర్ట్‌ఫోలియోను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాల ద్వారా నిధులను సమీకరించుకోవాలనే ఉద్దేశంతోనే టాటా స్టీల్ ఈ నిర్ణయం తీసుకుంది. అధిక విలువ గల ప్రధాన ఉక్కు తయారీ విభాగాలపై మరింత దృష్టి సారించేందుకు ఈ విక్రయం దోహదపడనుంది. దీనిపై కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణుడు కృష్ణ అయ్యర్ స్పందిస్తూ.. ట్యూబ్స్, పైప్స్, కలర్-కోటెడ్ స్టీల్ విభాగాలకు ఉక్కు ప్రధాన ముడిసరుకు అయినప్పటికీ వాటికి ప్రత్యేక తయారీ కేంద్రాలు, పంపిణీ నెట్‌వర్క్ అవసరమన్నారు. వీటిని ఏపీఎల్ అపోలోకు అప్పగించడం వల్ల టాటా స్టీల్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టవచ్చని పేర్కొన్నారు. అటు ఏపీఎల్ అపోలో సైతం తన తయారీ సామర్థ్యాన్ని, మార్కెట్ వాటాను భారీగా పెంచుకునే అవకాశం లభిస్తుందని విశ్లేషించారు.
Also Read: ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?