Expensive Milk Powder| ఈ రోజుల్లో స్వచ్ఛమైన గేదె, ఆవు పాలు లీటర్ ధర రూ.50 నుంచి రూ.100 మధ్య ఉంటాయని మనకు తెలుసు. కానీ ఒక లీటర్ పాల ధర ఏకంగా రూ.7,000 అంటే నమ్మగలరా? అవును.. ఇప్పుడు గాడిద పాలకు ఇంత భారీ ధర పలుకుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రత్యేకంగా గాడిదల ఫామ్ ప్రారంభమైంది. కేవలం 12 గాడిదలతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు గాడిద పాలకు ఇంత ధర ఎందుకు? ఈ ఫామ్ వెనుక ఉన్న వ్యాపార ఆలోచన ఏమిటో తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో డయారికా ఫామ్స్ (Dairica Farms) ఈ ప్రత్యేక ఫామ్ ఏర్పాటు చేసింది. వ్యాపారవేత్త సంజీవ్ సింగ్ ఠాకూర్ 12 గాడిదలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. భవిష్యత్తులో వాటి సంఖ్యను 25కు పెంచాలని కంపెనీ భావిస్తోంది. కందరోర్ గ్రామంలో నిర్వహించిన డైరీ కన్‌క్లేవ్ 2026 సందర్భంగా ఈ ఫామ్ ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ ధర్మానీ దీన్ని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రైతులకు కొత్త ఆదాయ మార్గాలను పరిచయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
గాడిద పాలను లీటర్‌కు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ఈ పాలతో తయారుచేసే మిల్క్ పౌడర్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. పాల నాణ్యతను బట్టి ఒక కిలో గాడిద పాల పౌడర్ ధర రూ.20,000 నుంచి రూ.80,000 వరకు ఉండవచ్చని అంచనా. స్కిన్‌కేర్, బ్యూటీ, ఆరోగ్య ఉత్పత్తులు తయారుచేసే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు పాలను సరఫరా చేయాలని ఫామ్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రముఖ బిజినెస్ పత్రిక సిఎస్ఆర్ జర్నల్ ప్రకారం.. డయారికా ఫామ్స్ ఇప్పటికే పాల ఉత్పత్తి, సేకరణ, విక్రయ కార్యకలాపాల్లో పాల్గొంటోంది.
భారతదేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోతుండటాన్ని గమనించి ఈ బిజినెస్ ఐడియా వచ్చిందని కంపెనీ సహ వ్యవస్థాపకురాలు సీరత్ టూర్ తెలిపారు. అందుకే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన స్పిటి జాతి గాడిదల పెంపకంపై దృష్టి పెట్టారు.
సంజీవ్ సింగ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ ప్రస్తుతం రోజుకు 2,700 లీటర్లకు పైగా పాలు సేకరిస్తోంది. సొంత ఫామ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పశువుల యజమానులతో కూడా కలిసి పనిచేస్తున్నారు.
Also Read: పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఏఐని ప్రయోగించిన తండ్రి.. సూపర్ ఐడియా
గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. అర్హులైన వారికి ఫామ్ ఏర్పాటు కోసం గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 3,843 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.2,672.65 కోట్లు.
Also Read: 9 నెలల్లో రూ.56 లక్షలు ఆదాయం.. ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న దంపతులు.. ఐడియా సూపర్ హిట్
సాధారణంగా గాడిదలను రవాణా, ఇతర పనుల కోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు వాటి పాలతో కూడా వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరికొందరు రైతులు కూడా ప్రత్యామ్నాయ పశుపోషణ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే ఉత్పత్తి, మార్కెట్ డిమాండ్, సరఫరాపైనే ఈ వ్యాపారం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.