Online Platforms: ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి సమయాన్ని ఆదా చేయడంతో ఇంట్లో కూర్చునే కోరుకున్న వస్తువులు, అవసరమైన సేవలు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ సేవలు అందించే ఫ్లాట్ ఫామ్స్.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అదనపు వసూళ్లకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఆన్ లైన్ వేదికలను కేంద్రం గుర్తించి భారీ జరిమానాలను సైతం విధించింది.
హైదరాబాద్ వంటి నగరాల్లో బిగ్ బస్కెట్, జెప్టో, బ్లింకిట్, బుక్ మై షో సర్వీసుల వాడకం విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది తమకు ఏ వస్తువు కావాలన్నా, వీకెండ్ లో సినిమా టికెట్స్ పొందాలన్నా వీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే కస్టమర్ల అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ అదనంగా ఛార్జీలను విధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరుతో జెప్టో.. బాస్కెట్ స్నీకింగ్ పేరుతో బుక్ మై షో కస్టమర్ల నుంచి అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా స్మాల్ కార్ట్ ఛార్జ్ పేరుతో కూడా డోర్ డెలివరీలపై రూ.20 అదనంగా కొన్ని ఫ్లాట్ ఫామ్స్ వసూల్ చేస్తున్నాయి.
ఉదాహరణకు ఓ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో రూ.72 విలువైన వస్తువును డెలివరీ చేసేందుకు ఏకంగా రూ.134 గ్రాండ్ టోటల్ బిల్ ను కస్టమర్ కు చూపించారు. అంటే వస్తువు ధరకు డబుల్ అన్నమాట. డెలివరీ ఛార్జ్ పేరుతో రూ.30, హ్యాండ్లింగ్ ఛార్జ్ రూ.12, స్మాల్ కార్ట్ ఛార్జ్ రూ.20 ఆ డెలివరీ బిల్లులో చూపారు. అంటే వస్తువు ధర రూ.72 కాగా, దానిని ఇంటికి తరలించినందుకు రూ.62 ఛార్జీ చెల్లించాలన్నమాట. అంటే దాదాపు 50 శాతం అదనం. అయితే ఇందులో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. రూ.99 దాటిన ఆన్ లైన్ డెలివరీలపై స్మాల్ కార్ట్ ఛార్జీ (రూ.20) ఉండదని సదరు కంపెనీ చెబుతోంది. అంటే అవసరం లేకపోయినా ఎక్కువ మెుత్తంలో ఆర్డర్ పెట్టమని పరోక్షంగా కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇలా అదనపు వసూళ్లతో కస్టమర్లను మోసం చేస్తున్న ఫ్లాట్ ఫామ్ పై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) ఉక్కుపాదం మోపింది. ఇండిగో, జెప్టో, ఫస్ట్ క్రి, ఫిజిక్స్ వాలా, స్పైస్ జెట్ సహా తొమ్మిది ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం.. రాజ్యసభకు వెల్లడించింది. మొబైల్ యాప్‌లు, ఈ-కామర్స్ సైట్లలో సరుకులు లేదా సేవలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులను గందరగోళానికి గురిచేసే 13 రకాల ‘డార్క్ ప్యాటర్న్స్’ ను గుర్తించినట్లు తెలిపింది.
‘ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్ గైడ్‌లైన్స్- 2023’ చట్టం కింద ఆయా ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై జరిమానాలు విధించినట్లు రాజ్యసభకు కేంద్రం తెలియజేసింది. కృత్రిమంగా అవసరాలు సృష్టించడం, తెలియకుండా అదనపు చార్జీలు కలపడం, హైడింగ్ ఛార్జీలు, సబ్ స్క్రిప్షన్ ట్రాప్స్ వంటివి ఉపయోగించి కస్టమర్లను అవి మోసం చేసినట్లు తెలియజేసింది. ఈ తరహా మోసాలను 2025 జూన్ లోనే గుర్తించి.. అడ్వైజరీ జారీ చేసినా కొన్ని సంస్థలు బేఖాతరు చేశాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలు పాటించని సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.20 లక్షల జరిమానా వసూలు చేసినట్లు పార్లమెంటుకు వివరణ ఇచ్చింది.
అత్యధిక జరిమానా విధించబడ్డ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో జెప్టో, ఫిజిక్స్ వాలా ముందు వరుసలో ఉన్నాయి. జెప్టో (Zepto) వస్తువుల ధరలు తొలుత తక్కువ చూపించి.. తర్వాత హ్యాండ్లింగ్ చార్జీలు, మెంబర్‌షిప్ ఫీజులను సీక్రెట్ గా ఫైనల్ బిల్ లో జోడిస్తున్నట్లు తేలింది. దీంతో డ్రిప్ ప్రైసింగ్, బాస్కెట్ స్నీకింగ్ కింద జెప్టోకు రూ.7 లక్షల జరిమానా విధించింది. మరోవైపు ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’ తన ‘PW ఫౌండేషన్’ కు రూ.10 డొనేషన్ ఆప్షన్‌ను ముందే సెలెక్ట్ చేసి ఉంచడం, ఫ్రీ కోర్సుల కోసం వ్యక్తిగత వివరాలను తప్పనిసరి చేయడంతో రూ.5 లక్షల పెనాల్టీ ఎదుర్కొంది.
అటు విమాన టికెట్ల బుకింగ్ సమయంలో ఇండిగో యాప్ ‘No I will take risk’ అనే సందేశంతో ప్రయాణికులను భయపెట్టే యత్నం చేసింది. దీంతో CCPA జోక్యంతో దానిని ‘No, I will not add to the trip’గా మార్చారు. బుక్‌మైషోలో కూడా అనుమతి లేకుండా టికెట్ పై రూ.1 చారిటీ విరాళాన్ని డిఫాల్ట్‌గా ఉంచడాన్ని హెచ్చరించడంతో ఆ సంస్థ దానిని తొలగించింది.
Also Read: అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!
పైన పేర్కొన్న వాటితో పాటు మరికొన్ని సంస్థలు సైతం నిబంధనలు ఉల్లఘించి.. జరిమానా ఎదుర్కొన్నాయి. ఫస్ట్‌క్రి (రూ.2 లక్షలు), ఫార్మాఈజీ (రూ.1 లక్ష), మెక్‌అఫీ (రూ.1 లక్ష), స్పైస్‌జెట్ (రూ.1 లక్ష), కోచింగ్ ప్లాట్‌ఫామ్ అనుజ్ జిందాల్ (రూ.3 లక్షలు) సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. టైమర్ల ద్వారా అత్యవసరాన్ని సృష్టించడం, హిడెన్ ఛార్జీలు వసూలు చేయడం, సబ్‌స్క్రిప్షన్ల విషయంలో మోసపూరిత విధానాలను పాటించినందుకు వీటిపై చర్యలు చేపట్టారు.
Also Read: Airtelలో ఇంత మంచి ప్లాన్ ఉందా? ఏడాదంతా అపరిమిత 5G, కాల్స్, ఫ్రీ ఓటీటీ.. వర్త్ వర్మా వర్త్!