Tips to become a big YouTuber| ఒకప్పుడు సాధారణంగా వీడియోలు చేసే యువకుడు, ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద యూట్యూబ్ క్రియేటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతనే మిస్టర్ బీస్ట్ (MrBeast). ఆయన అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. ఆయన ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2026 జూన్‌లో 500 మిలియన్లు దాటింది. దీంతో ఆయన నెలవారీ ఆదాయం ఎంత అనే ఆసక్తి చాలామందిలో పెరిగింది. అంతేకాదు, ఆయనలాంటి పెద్ద యూట్యూబ్ కావాలంటే ఏం చేయాలో కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.
మిస్టర్ బీస్ట్‌కు యూట్యూబ్ నుంచి నిర్ణీత నెలవారీ జీతం ఉండదు. ఆయనకు వీడియోలు, బ్రాండ్ డీల్స్, వ్యాపారాలు, ఇతర ప్రాజెక్టుల నుంచి ఆదాయం వస్తుంది. అంతర్జాతీయ బిజినెస్ పత్రిక.. ఫోర్బ్ 2025 టాప్ 25 క్రియేటర్స్ నివేదిక ప్రకారం.. ఆయన వార్షిక ఆదాయం సుమారు 85 మిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని 12 నెలలకు విభజిస్తే నెలకు సుమారు 7.1 మిలియన్ డాలర్లు వస్తాయి.
డాలర్ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.95.8గా ఉంది. ఇది దాదాపు రూ.68 కోట్లకు సమానం. అయితే ఇది కేవలం సగటు లెక్క మాత్రమే.
ప్రతి నెలా ఆయనకు ఇదే మొత్తం వస్తుందని చెప్పలేం. ఆదాయం నెలనెలా మారుతూ ఉంటుంది.
మిస్టర్ బీస్ట్ ఆదాయం కేవలం YouTube ప్రకటనలకే పరిమితం కాదు. ఆయనకు అనేక బ్రాండ్లు, వ్యాపారాలు, ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. Feastables అనే ప్రముఖ చాక్‌లెట్, స్నాక్ బ్రాండ్ కంపెనీ ఆయనే ప్రారంభించారు. అతను సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని తిరిగి కంటెంట్ తయారీలో పెట్టుబడి పెడతారు. కొంత డబ్బు వ్యాపారాలు, సిబ్బంది, కొత్త ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తారు.
అందువల్ల ఆయన మొత్తం ఆదాయం వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ఉండదు.
పెద్ద యుట్యూబర్ కావడానికి మొదట ఖరీదైన కెమెరా అవసరం లేదు. మంచి ఆలోచన, స్పష్టమైన విషయం, నిరంతర ప్రయత్నం చాలా ముఖ్యం. మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకోండి. అదే సమయంలో ప్రేక్షకులు చూడాలనుకునే కంటెంట్‌ను కూడా గుర్తించండి. మీరు నిరంతరం వీడియోలు చేయగలిగే అంశాన్ని ఎంచుకోవడం మంచిది. మిస్టర్ బీస్ట్ తన కంటెంట్‌ను నిరంతరం మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. అందుకనే ప్రతి వీడియోతో ఏదో ఒక విషయాన్ని మెరుగుపరచడం కొత్త క్రియేటర్లకు ఉపయోగపడుతుంది.
Also Read: ఆఫీస్ పాలిటిక్స్‌తో మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందా? స్ట్రెస్ తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్
యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం మాత్రమే విజయాన్ని తీసుకురాదు. ప్రేక్షకులు వీడియోపై క్లిక్ చేసేలా మంచి కారణం ఉండాలి. వీడియో టైటిల్, థంబ్‌నెయిల్, ప్రారంభ భాగం చాలా ముఖ్యమైనవి. చిన్న ఛాలెంజ్‌లు, కథలు, ప్రయోగాలు లేదా కొత్త ఆలోచనలను కంటెంట్‌లో ఉపయోగించవచ్చు. సాధారణ విషయాన్ని కూడా కొత్త విధానంలో చూపించడం ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది.
Also Read: యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం
కొత్త ఛానల్‌కు మొదటి రోజుల్లో లక్షల వ్యూస్ రావడం సాధారణం కాదు. మొదటి వీడియోలకు తక్కువ మంది ప్రేక్షకులు రావచ్చు. అయితే ప్రతి వీడియో నుంచి నేర్చుకుని తర్వాతి వీడియోను మెరుగుపరచవచ్చు. ఎడిటింగ్, టైటిల్స్, థంబ్‌నెయిల్స్, కథ చెప్పే విధానాన్ని మెరుగుపరచండి. ప్రేక్షకులు ఏ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారో కూడా గమనించండి.
చివరగా, డబ్బు కంటే మంచి కంటెంట్‌పై దృష్టి పెట్టండి. నిరంతర ప్రయత్నం, క్రియేటివిటీతో, ఓపికతో యూట్యూబ్‌లో ప్రేక్షకులను క్రమంగా పెంచుకోండి.