Banks Open Sunday: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగుతుండడంతో ఆర్బీఐ-ఆర్థిక శాఖ అలర్ట్ అయ్యాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మె నేపథ్యంలో ఆదివారం బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ-రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించాయి.
సోమవారం నుంచి మూడురోజులు బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆర్థికశాఖ. మూడు రోజుల పాటు సమ్మె నేపథ్యంలో ఆదివారం బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ-రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించాయి. ఫలితంగా ఈనెల 27న ఆదివారం బ్యాంకులు పని చేయనున్నాయి. బ్యాంకు వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది ఆర్థిక శాఖ. నార్మల్‌గా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులు పని చేయవు.
సోమవారం అనగా 28 నుంచి మూడు రోజుల సమ్మె నేపథ్యంలో ఐదు రోజులు బ్యాంకు సేవలకు విఘాతం కలగనుంది. దీన్ని గమనించిన ఆర్థికశాఖ, ఆదివారం బ్యాంకులు తెరిచేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ నిర్ణయానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్లు ప్రస్తావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆదివారం పని చేయనున్నాయి. ప్రజల బ్యాంకింగ్ అవసరాలు సుదీర్ఘకాలం పాటు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ALSO READ: నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి
సోమవారం నుంచి సమ్మె ప్రారంభమయ్యేలోపు వినియోగదారులకు అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందేలా చూడటమే దీని లక్ష్యం. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం-బ్యాంకు యాజమాన్యాలు.. యూనియన్లకు విజ్ఞప్తి చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ బ్యాంకు శాఖలకే కాకుండా కార్యాలయాలు, ఏటీఎం-అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లకు వర్తిస్తుంది. దీనివల్ల అదనపు పని దినం రోజు బ్యాంకింగ్ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో పని చేయనుంది. బ్యాంకు ఖాతాదారుల సంక్షేమం, సౌకర్యం ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
వారంలో ఐదు రోజుల పని దినాల విధానం అమలు చేయకపోవడంపై ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. రెండేళ్ల కిందట కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి ఐదు రోజులే పని చేసి, రోజుకు 40 నిమిషాలు అదనంగా పని చేసేందుకు రెడీ అయ్యారు బ్యాంకు ఉద్యోగులు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం రాలేదు. స్కేల్-4, పై అధికారులకు ప్రత్యేకంగా పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ – పీఎల్‌ఐ పథకంపై అసంతృప్తి తీవ్రమైంది. పనులకు ఆటంకం కలిగినా డిజిటల్ సర్వీసులు యథాతథంగా అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వినియోగదారులకు సూచనలు చేశాయి.