Gold Monetisation Scheme: బంగారం ధరలు తారాజువ్వలా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దాని ఆధారంగా ఏర్పాటు చేసిన పథకాలపై దృష్టి సారించింది కేంద్రం. వీటికి ఆపాలనే నిర్ణయానికి వచ్చింది. అందులో ఒకటి బంగారం మానిటైజేషన్ పథకం. సింపుల్ గా చెప్పాలంటే పసిడి నగదీకరణ పథకం అన్నమాట. మార్చి 26 నుంచి నిలిపి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
బంగారం ధరల పెరగడమే కారణమా?
మార్కెట్ పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. బంగారం మానిటైజేషన్ పథకం (Gold Monetisation Scheme)లో మూడు రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక ఒకటి నుంచి మూడేళ్లు బ్యాంక్ డిపాజిట్, మధ్యకాల ప్రభుత్వ డిపాజిట్ ఇది ఐదేళ్ల నుంచి ఏడేళ్లు , దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ 12 నుంచి 15 ఏళ్లు వరకు ఉన్నాయి.
వీటిలో స్వల్పకాలిక బంగారం డిపాజిట్ పథకాన్ని కొనసాగించే విషయమై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి ఈ పథకాల్లో డిపాజిట్ చేసి, వడ్డీ పొందడం అన్నమాట. గడువు ముగిశాక ఆ బంగారానికి సమానమైన బంగారం, డబ్బు పొందే వీలు ఉంది.
బంగారం దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో సరిగ్గా పదేళ్ల కిందట అంటే సెప్టెంబరు 15న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలను ఈ పథకం కింద బ్యాంకుల్లో ఇవ్వాలి. వాటి విలువపై 2.25 నుంచి 2.50 శాతం వరకు వడ్డీ పొందే వీలు ఉంది. గతేడాది నవంబరు నాటికి ఈ పథకం కింద 31,164 కిలోగ్రాముల బంగారం బ్యాంకులకు చేరింది. అందులో స్వల్ప కాలిక విభాగంలో- 7,509 కిలోలు, మధ్య కాల- 9,728 దీర్ఘకాలం- 13,926 కిలోలు చేరింది.
ALSO READ: యూపీఐ లింకప్ సేవలు మరింత సులభతరం
సావరిన్ గోల్డ్ బాండ్ సైతం
బంగారం ధరలు రోజు రోజుకు పెరగడంతో మదుపరుల చూపు అటువైపు పడింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ తోపాటు కొన్ని ఉన్నాయి. భారతదేశం ప్రతీ ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటోంది.
బంగారం కొనుగోళ్లను తగ్గించే ఉద్దేశంతో సరిగ్గా పదేళ్ల కిందట సావరిన్ గోల్డ్ బాండ్ (sovereign gold bonds) పథకం ప్రారంభించింది కేంద్రం. దీనికి అప్పట్లో ఈ పథకానికి మంచి ఆదరణ ఉంది. అయితే బంగారం ధర క్రమంగా పెరగడంతో పెట్టుబడుదారులకు మంచి లాభాలు వచ్చాయి.
కేంద్రం తరపున ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. 2017-18లో గ్రాము ధర రూ. 2,990 మధ్య బంగారు బాండ్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు గ్రాముకు దాదాపు 200 శాతం లాభపడుతున్నారు. దీనికి అదనంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై 2.5 శాతం వడ్డీ రేటును ఆరు నెలల కాలానికి చెల్లిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ల చివరి విడత గతేడాది ఫిబ్రవరి గ్రాముకు రూ. 6,263 ధరకు జారీ చేసింది.
బాండ్లపై చెల్లింపులు వాటి నుండి వచ్చే ఆదాయాన్ని మించిపోయాయి. ఈ క్రమంలో ఈ పథకాన్ని తర్వాత నిలిపి వేసింది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆర్భీఐ డేటా ప్రకారం.. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రూ. 72,274 కోట్లు సేకరించింది. అయితే ప్రస్తుత బంగారం ధరల ప్రకారం సేకరించిన డబ్బు విలువ ఇప్పుడు సుమారు రూ. 1,48,011 కోట్లు.
తగ్గుతాయని భావించిన బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా చెల్లింపులు అమాంతంగా పెరిగిపోయాయి. 8 ఏళ్ల కాల పరిమితి ఉన్నప్పటికీ, ఐదేళ్ల తర్వాత ముందుగానే రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలామంది పెట్టుబడిదారులు మూల ధన లాభాల పన్నుపై మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి వాటిని ఉంచడానికి ఇష్టపడతారు.
కనీసం గ్రాము నుంచి గరిష్టంగా నాలుగు కిలోల వరకు బంగారం కొలుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు వంటివి 20 కిలోల వరకు కొనేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి బాండ్లు జారీ చేయలేదు. దీన్ని కూడా దాదాపుగా నిలిపి వేయవచ్చని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.