మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.అప్పుడు సమయం సుమారు పదకొండున్నర కావస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాస్త స్లో గా ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు.ఇండికేటర్ వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడా బైక్‌కి హెడ్‌లైట్ కూడా వెలగడంలేదు. మరి హెడ్‌లైట్ పాడైందా లేదా ఇంకేదైనా జరిగి హెడ్‌లైట్ వేయలేదా అనేది కూడా మిస్టరీగానే ఉంది. ఆ తర్వాత కాస్త దూరంలో ఆయన మరణించిన ప్రదేశం ఉంది.
అయితే ఆయన మృతి చెందిన ప్రాంతం కొంతమూరు వద్ద.. ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తాజాగా విడుదల చేసిన మరో సీసీ ఫుటేజ్‌లో తెలుస్తోంది. కొవ్వూరు టోల్గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది.అక్కడ ఆయన బుల్లెట్ బైక్‌కి ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్‌లో తెలుస్తోంది.కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావడం లేదు. అప్పుడు కూడా ఆయన బండికి హెడ్‌లైట్ వెలగలేదు.
అయితే వెనకనుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్‌ని ఢీకొట్టిందా అంటే దానికీ సరైన ఆధారాలు దొరకటం లేదు. ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొంటే శబ్దం రావడం జరుగుతుంది. అదే జరిగితే కనీసం అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న వాహనం ఏదో ఒకటి ఆపి ఉండేవారు. ఇక్కడ అలాంటిదేం జరగలేదు.వాహనాలు సాఫీగా వెళ్లిపోయాయి. దీంతో రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉండిపోయింది. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో విషయం తెలిసింది.
ప్రవీణ్ పగడాల చనిపోయారు. అయితే ఆయన ఎలా చనిపోయారనేదే ఇంకా నిర్థారణ కాలేదు. అక్కడున్న సీన్ చూస్తే ప్రమాదం అని చెప్పడానికి తాజా సీసీ ఫుటేజ్ ద్వారా కొంతమాత్రమే అర్థమవుతోంది. దాడి జరిగిందని చెప్పడానికి మాత్రం ఎక్కువ సాక్ష్యాలున్నట్టు స్పష్టమవుతోంది. బుల్లెట్ బైక్ కి అక్కడక్కడ గీతలు పడ్డాయి, హెడ్ ల్యాంప్ వద్ద కూడా బండి కాస్త డ్యామేజీ అయింది. బండి కింద పడితే అలాంటి డ్యామేజీ కాదని స్థానికులంటున్నారు.
Also Read: మరణానికి కొన్ని నిమిషాల ముందు.. సీసీటీవీ కెమేరాకు చిక్కిన ప్రవీణ్ పగడాల చివరి క్షణాలు
బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోతే కచ్చితంగా హెల్మెట్ డ్యామేజీ అవుతుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్ కి ఏమీ కాలేదు, ప్రమాద స్థలంలోనే అది పడిపోయి ఉంది. పైగా ప్రమాద స్థలంలో ఒక చెక్క ముక్క కూడా కనపడుతోంది. దానిపై కూడా రక్త గాయాలున్నాయి. దీంతో స్థానికుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రవీణ్ పగడాల పెదాలపై గాయాలుండటం, అవి ప్రమాదం జరిగినప్పుడు తగిలిన దెబ్బల్లాగా లేకపోవడంతో కచ్చితంగా దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రవీణ్ హత్య కేసును పర్యవేక్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా SP నరసింహ కిషోర్ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SP ప్రకటించారు.మరోవైపు ఇవాళ ఉదయం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.