Gurugram: ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు బూమ్ వచ్చింది. మధ్యలో నిలిచిపోయిన, పూర్తయిన ప్రాజెక్టులకు సంబందించి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో ఫ్లాట్ 10 కోట్ల చొప్పున, వారంలో 1164 ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ.
వడ్డీ రేట్లు తగ్గడంతో వినియోగదారుల చూపు ఇళ్లపై పడ్డాయి. సొంతంగా ఇంటిని సమకూర్చుకోవాలనే ఆలోచనలో పడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయి. వినియోగదారులు వెతుకులాటలో పడ్డారు. కేవలం ఒక్క వారంలో 1100 పైగానే లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయి.
ఒక్కో ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా? మినిమం రూ.9.5 కోట్ల నుంచి 25 కోట్లు వరకు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో సరి కొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్ వెంచర్ మొదలుపెట్టింది. 116 ఎకరాల విశాలమైన టౌన్‌షిప్ అది. ఎత్తైన ఆరు టవర్స్ నిర్మించింది. 50 అంతస్తుల నిర్మాణాలను ఆ సంస్థ చేపట్టింది.
ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ డీఎల్ఎఫ్ టవర్లు ఇవే. ఫ్లాట్ విలువతో సంబంధం లేకుండా గృహ వినియోగదారులు ఆ ఫ్లాట్ల కోసం ఎగబడ్డారు. వారం రోజుల్లో 1164 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. దేశంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ బూమ్ వచ్చిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ALSO READ: పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు
రెసిడెన్సియల్ ప్రాజెక్టులో 1,152 నాలుగు గదుల బెడ్‌రూమ్ ఉన్నాయి. అలాగే డజను పెంట్ హౌస్‌లు ఉన్నాయి. ప్రివానా నార్త్‌లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ.9.5 కోట్ల నుంచి మొదలై రూ.25 కోట్ల వరకు ఉంటుంది. ఆకట్టుకునే నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన నివాస స్థలాలు ఉండడంతో ఈ రేటు పలికిందన్నది మార్కెట్ వర్గాల మాట.
దీనిపై డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లు గతంలో తాము చేపట్టిన నిర్మాణాల కంటే దాదాపు 33 శాతం పెద్దవిగా ఉన్నాయన్నారు. ప్రతి యూనిట్ కు మూడు ప్రత్యేక పార్కింగ్ స్లాట్‌లతో రానుందని తెలిపారు. విశాలమైన లివింగ్ ఏరియాలు, లైఫ్ స్టైల్ కిచెన్‌లు, 500 మీటర్ల వెడల్పు గల రిజర్వ్డ్ గ్రీన్ జోన్ దీని ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు.
డీఎల్ఎఫ్ ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే కారణమని ఆ కంపెనీ మాట. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించబడింది ఈ టౌన్‌షిప్. DLF కార్పొరేట్ గ్రీన్స్, TCS, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్యాంపస్‌లకు సమీపంలో ఉండటం వల్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు వినియోగదారులు. అక్షరాలా 11 వేల అమ్మకాలు నమోదు చేసింది.
నివాసాలకు కేఫ్‌లు, లాంజ్‌లు, డ్రై క్లీనింగ్ కియోస్క్‌లు టవర్లలో ఉండనున్నాయి. హాబీ కార్నర్‌ల వంటి క్యూరేటెడ్ సౌకర్యాలతో ఉండనున్నాయి. ప్రతి టవర్‌లో ఎనిమిది హై-స్పీడ్ ఎలివేటర్లు, రెండు సర్వీస్ ఎలివేటర్‌లు ఉంటాయి. సింగపూర్ నుండి HB డిజైన్ మాస్టర్ ప్లానింగ్, అబుదాబి నుండి ఇన్‌సైట్ ఇంటర్నేషనల్ ల్యాండ్‌స్కేపింగ్, సింగపూర్ నుండి సుర్బానా జురాంగ్ ట్రాఫిక్ డిజైన్, న్యూయార్క్ నుండి థార్న్టన్ టోమసెట్టి-LERA వంటి ప్రపంచ సంస్థలు ఈ ప్రాజెక్టు వెనుకున్నాయి.