Income Tax vs TDS: దేశంలో మన ఆదాయంపై పన్నులు చెల్లించడం అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో కీలకమైన భాగంగా మారిపోయింది. అయితే, ఇన్‌కం ట్యాక్స్, టీడీఎస్ (Tax Deducted at Source) గురించి చాలా మందికి స్పష్టత ఉండకపోవచ్చు. ఈ రెండూ ఆదాయంపై విధించే పన్నులే అయినప్పటికీ, వీటి ఉద్దేశ్యం, వర్తించే విధానం, ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఇన్‌కం ట్యాక్స్
ఇన్‌కం ట్యాక్స్ అనేది మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించే ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లించే పన్ను. ఇది జీతం, వ్యాపార లాభాలు, అద్దె ఆదాయం, పెట్టుబడుల నుంచి వచ్చే వడ్డీ, లేదా ఆస్తుల అమ్మకంతో వచ్చే లాభం వంటి వివిధ మార్గాల నుంచి వచ్చే ఆదాయంపై విధించబడుతుంది.
1961 ఇన్‌కం ట్యాక్స్ చట్టం ప్రకారం, ఈ పన్ను వసూలు చేయబడుతుంది. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షలకు మించి, కొత్త విధానంలో రూ.3 లక్షలకు మించిన ఆదాయం ఉంటే, మీరు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే? అది పన్ను ఎగవేతగా పరిగణించబడి. జరిమానా లేదా శిక్ష కూడా పడవచ్చు.
టీడీఎస్
టీడీఎస్ (Tax Deducted at Source) అంటే, మీ ఆదాయం మీ చేతికి రాకముందే, దానిలోని కొంత భాగాన్ని పన్నుగా కత్తిరించి ప్రభుత్వానికి చెల్లించడం. దీని లక్ష్యం? పన్ను ఎగవేతను నిరోధించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయం చేరేలా చేయడం.
ఉదాహరణకు: మీరు ఉద్యోగిగా ఉంటే, మీ యజమాని మీ జీతంలో నుంచి కొంత శాతం TDSగా కత్తిరించి, దానిని ప్రభుత్వానికి చెల్లిస్తాడు. అదే విధంగా, బ్యాంక్ వడ్డీ, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, లేదా లాటరీ గెలుపులపై కూడా TDS వర్తిస్తుంది. ఈ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చెల్లింపు చేసే వ్యక్తి లేదా సంస్థ దానిని అనుసరించాలి.
Read Also: Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 …
మీ జేబుపై ఎలా ప్రభావం చూపుతుంది?
ఇన్‌కం ట్యాక్స్: మీ మొత్తం ఆదాయం, మినహాయింపులు, పన్ను స్లాబ్‌ల ఆధారంగా మీరు చెల్లించాల్సిన మొత్తం లెక్కించబడుతుంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికలో పెద్ద భాగం.
టీడీఎస్: మీ ఆదాయంలో కొంత భాగం ముందే చెల్లించే పద్ధతి, ఆ క్రమంలో మీ చేతికి వచ్చే నగదు తగ్గుతుంది. అయితే, ఇది మీ ఇన్‌కం ట్యాక్స్ లెక్కల్లో సర్దుబాటు అవుతుంది.
మీరు ఏం చేయాలి?
-ఫార్మ్ 26AS లేదా AIS చెక్ చేయండి: మీ ఆదాయంపై ఎంత TDS కట్ అవుతుందో తెలుసుకోండి.
-పన్ను రిటర్న్ ఫైల్ చేయండి: మీరు అదనంగా పన్ను చెల్లించాలా లేదా రీఫండ్ పొందాలా అనేది లెక్కించండి.
-ముందస్తు ప్రణాళిక: పన్ను ఫైలింగ్ గడువు రాకముందే మీ ఆదాయం, ఖర్చులు, మినహాయింపులను సమీక్షించండి.
తేడాలను అర్థం చేసుకోవడం
ఇన్‌కం ట్యాక్స్, టీడీఎస్ రెండూ మన ఆర్థిక బాధ్యతలో భాగమే. ఇన్‌కం ట్యాక్స్ మీ మొత్తం ఆదాయంపై లెక్కించబడితే, టీడీఎస్ మీ ఆదాయాన్ని ముందే కొంత కట్ చేసి ప్రభుత్వానికి చేరేలా చేస్తుంది. ఈ తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా, మీరు మీ ఆర్థిక నిర్ణయాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.