Donald Trump : ట్రంప్ మహా తింగరోడు. పెద్ద మోసగాడు. ఫక్తు బిజినెస్ మేన్. అమెరికా ఫస్ట్ అనేదే ఆయన నినాదం. అందుకోసం ఏదైనా చేస్తాడు. ఎంతైనా టారీఫ్‌లు పెంచుతాడు. చైనాతో సై అంటాడు. భారత్ నై అంటాడు. ఏం చేసినా అమెరికా ప్రయోజనాల కోసమే అని చెబుతాడు. అదే సమయంలో లేనిగొప్పలు చెప్పుకుంటాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానే అని ఫోజులు కొడతాడు. ఇన్నిన్ని చేస్తూ.. చివరాఖరున మోదీ తనకు మంచి ఫ్రెండ్ అంటూ సోప్ వేస్తాడు. కాసేపటికే.. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనేలా సంచలన నిర్ణయాలతో భారత్‌కు షాకిస్తుంటాడు. లేటెస్ట్‌గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి యాపిల్‌ను లాగేసుకున్నాడు.
ఇండియాకు యాపిల్ రాకుండా చెక్
భారత్‌కు ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. యాపిల్ తయారీ ప్లాంట్లు మన దేశానికి తరలివస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ఖతార్‌లో భేటీ అయిన ట్రంప్.. ఆ కంపెనీ ప్లాంట్లు భారత్‌కు తరలించొద్దని చెప్పారు. టిమ్ కుక్ కూడా దానికి అంగీకరించారని స్వయంగా ఆయనే ప్రకటించారు.
ట్రంప్‌కు మోదీ జీరో టారిఫ్ ఆఫర్
చైనా, అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్‌తో యాపిల్ కంపెనీ అలర్ట్ అయింది. చైనాలోని యాపిల్ తయారీ ప్లాంట్లను ఇండియాకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాకు అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి.. ఎగుమతి చేయించేలా ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో చైనా నుంచి ఇండియాకు ఐఫోన్ తయారీ కేంద్రాలు షిఫ్ట్ అయితే మన ఆర్థిక వ్యవస్థకు పండగేనని సంబరపడుతున్న తరుణంలో ట్రంప్ దొబ్బకొట్టారు. భారత్‌కు యాపిల్ ప్లాంట్లు తరలించొద్దని ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌కు చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ కూడా అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తుందని అందుకే యాపిల్ కంపెనీని అడ్డుకున్నానని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల వస్తువులకు.. జీరో టారిఫ్ విధిస్తామంటూ ఇండియా తనకో ఆఫర్ ఇచ్చిందంటూ ట్రంప్ ఓ ప్రకటన చేశారు.
Also Read : భారత విమానాశ్రయాల్లో టర్కీ కంపెనీ పెత్తనం..
దోస్త్ అంటూనే ద్రోహం..
భారత్‌తో తమ బంధం విడదీయరానిదని చెప్పడం అమెరికాకు బాగా అలవాటు. ట్రంప్ అయితే మరో అడుగు వేసి మోడీ తన స్నేహితుడు అంటూ పొగుడుతుంటారు. కానీ.. ట్రంప్ మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉండదు. మొదట టారిఫ్‌ల రూపంలో దెబ్బ కొట్టాడు. లేటెస్ట్‌గా ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆపకపోతే ఆ రెండు దేశాలతో ట్రేడ్ నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు అబద్దాలు కూడా చెప్పారు. ఇప్పుడు ఏకంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ తయారీ కేంద్రాలు భారత్‌కు రాకుండా చెక్ పెట్టారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? దోస్త్ దోస్త్ అంటూనే.. ద్రోహం చేశారంటూ డొనాల్డ్ ట్రంప్‌పై మండిపడుతున్నారు భారతీయులు.