War Effect Real Estate| దేశీయ స్థిరాస్తి రంగంపై భారత్–పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగడమే కాకుండా.. మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం భారీ ఖర్చు అవసరమవుతుంది. ప్రధాన నగరాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గిపోతాయి. వినియోగదారులు, పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తారు. మల్టీనేషనల్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తాయి. రిటైలర్లు కొత్త షోరూంల ప్రారంభాలను ఆపేస్తారు.
నివాస రంగంపై ఇండియా పాక్ యుద్ధ ప్రభావం: యుద్ధ సమయంలో, ప్రత్యేకించి ఢిల్లీ–ఎన్‌సీఆర్, ఉత్తర భారతదేశం అలాగే ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గృహ కొనుగోళ్లు 5–10 శాతం తగ్గే అవకాశం ఉంది. లగ్జరీ గృహాలపై ప్రభావం ఎక్కువగా ఉంటే, అయితే స్థితి సాధారణ స్థాయికి తిరిగి వచ్చినా లగ్జరీ గృహాల అమ్మకాలు జరగడం కష్టమే. వాటి విక్రయాలు పుంజుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మధ్యతరగతి గృహాల డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. అయితే నిర్మాణ సామగ్రిపై ధరలు పెరిగే అవకాశం ఉంది.
వాణిజ్య రంగంపై యుద్ధ ప్రభావం: బహుళజాతి సంస్థలు విస్తరణలో ఆలస్యం చేస్తే, ఆఫీసు స్పేస్ లీజులపై ప్రభావం పడుతుంది. అయినప్పటికీ, సామాన్య స్థితులు వస్తే.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ రంగాల నుంచి డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని నిపుణలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రిటైల్ రంగం: బ్రాండెడ్ మాల్స్ పై యుద్ధం పెద్దగా ప్రభావం చూపకపోయినా.. రద్దీ తగ్గడం, కొత్త స్టోర్ల ప్రారంభాలు వాయిదా పడతాయి. హాస్పిటాలిటీ రంగంలో పర్యాటక ప్రాంతాల్లో హోటల్ ఆక్యుపెన్సీ 10–15 శాతం తగ్గుతుంది.
Also Read: కొత్త ఐపిఓలు వచ్చేస్తున్నాయి.. పెట్టుబడికి ప్లాన్ చేసుకోండి బాస్
యుద్ధాల చరిత్ర పరిశీలిస్తే..
1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం దేశ జీడీపీని 5.4 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. అప్పుడు నిర్మాణ రంగం పూర్తిగా స్థంభించిపోయింది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో కూడా స్థిరాస్తి రంగం తాత్కాలికంగా దెబ్బతిన్నా, తర్వాత వేగంగా కోలుకుంది.
యుద్ధం తర్వాత పరిణామాలు: యుద్ధాల తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రుణ విధానాలను సడలించడం, స్టాక్ మార్కెట్లలో తిరోగమనం వంటి చర్యలతో స్థిరాస్తి రంగం తిరిగి పుంజుకుంది. గత రెండు యుద్ధాల్లోనూ, మొదట భయాందోళన ఉన్నా కొన్ని నెలల్లోనే డిమాండ్ తిరిగి వస్తూ మార్కెట్ స్థిరపడిన ఉదాహరణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, తాత్కాలిక ప్రతికూలతలు ఉన్నా, దీర్ఘకాలికంగా స్థిరాస్తి రంగం మెల్లగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.