EPFO SWP Plan: ఉద్యోగం చేస్తున్న రోజుల్లో భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి నెలా జీతంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ రూపంలో పొదుపు చేస్తుంటారు. పదవీ విరమణ సమయానికి ఈ మొత్తం పెద్ద మొత్తంగా చేతికి అందుతుంది. అయితే ఆ డబ్బును ఒకేసారి తీసుకోవడం కంటే, నెలనెలా కొంత మొత్తాన్ని పొందుతూ మిగిలిన సొమ్ముపై వడ్డీ వచ్చే అవకాశం ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇలాంటి సదుపాయాన్ని అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)కు ఆమోదం కూడా తెలిపింది. ఈ విధానం అమల్లోకి వస్తే రిటైర్ అయిన ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెలవారీ లేదా నిర్ణీత వ్యవధుల్లో తీసుకోవచ్చు. ఈ విధానంలో ప్రత్యేకత ఏమిటంటే, ఖాతాలో మిగిలిన మొత్తంపై కూడా వడ్డీ వస్తుంది.
ఈ విధానం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రిటైర్మెంట్ సమయానికి మీ పీఎఫ్ ఖాతాలో రూ.50 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇదే వడ్డీ రేటు రాబోయే 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని భావిస్తే, మీరు ప్రతి నెలా రూ.30 వేల చొప్పున విత్‌డ్రా చేసుకోవచ్చు. మొదటి నెలలో రూ.30 వేలు తీసుకున్న తర్వాత ఖాతాలో రూ.49.70 లక్షలు మిగులుతాయి. ఈ మొత్తంపై వడ్డీ జమ అవుతుంది. ఆ తర్వాతి నెలలోనూ రూ.30 వేలు తీసుకున్నప్పటికీ, మిగిలిన సొమ్ముపై వడ్డీ రావడంతో ఖాతా బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా వడ్డీతో పాటు కాంపౌండింగ్ ప్రభావం కూడా దీర్ఘకాలంలో నిధి పెరుగుదలకు దోహదపడుతుంది.
ఈ లెక్క ప్రకారం నెలకు రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.3.60 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐదేళ్లలో రూ.18 లక్షలు, పదేళ్లలో రూ.36 లక్షలు, 15 ఏళ్లలో రూ.54 లక్షలు, 20 ఏళ్లలో మొత్తం రూ.72 లక్షలు మీ చేతికి అందుతాయి. అయినప్పటికీ, 8.25 శాతం వార్షిక వడ్డీని నెలవారీగా లెక్కించిన అంచనా ప్రకారం 20 ఏళ్ల చివరికి పీఎఫ్ ఖాతాలో సుమారు రూ.75.33 లక్షలు మిగిలే అవకాశం ఉంది. అంటే మీరు తీసుకున్న రూ.72 లక్షలతో పాటు ఖాతాలో మరో రూ.75 లక్షలకు పైగా నిధి ఉండొచ్చన్నమాట. అయితే ఈ లెక్కలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో EPF వడ్డీ రేటు మారితే చివరికి మిగిలే మొత్తం కూడా మారుతుంది. అంతేకాదు SWP ప్రతిపాదనకు EPFO బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ, అమలుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కాబట్టి ఈ సదుపాయం అందుబాటులోకి రావాడానికి మరికొంత సమయం పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ డబ్బుతో ఒక స్థిరమైన ఆదాయం పొందాలనుకునే ఉద్యోగులకు మాత్రం ఈ ప్రతిపాదన ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
గమనిక : రూ.75.33 లక్షల లెక్క 8.25% వడ్డీ రేటు 20 ఏళ్ల పాటు మారకుండా ఉంటేనే కొనసాగుతుందనేది ఒక అంచనా మాత్రమే. ఇది EPFO ఇచ్చిన హామీ కాదు. EPFO బోర్డు 2026 నవంబర్ 19న SWP ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే EPF పథకంలో అవసరమైన సవరణలు, అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఈ విధానం అమల్లోకి వస్తుంది.