Hyderabad Real Estate: ఒకప్పుడు హైదరాబాద్‌లో సొంతంగా ఒక ఫ్లాట్ కొనాలంటే బిల్డర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నచ్చిన ఫ్లాట్ దొరికితే వెంటనే అడ్వాన్స్ చెల్లించకపోతే వేరేవాళ్లు కొనేస్తారనే భయం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. నగరంలో ఎటు చూసినా భారీ అపార్ట్‌మెంట్లు కనిపిస్తున్నా.. వాటిలో నివసించే వాళ్లు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఎన్నో ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. కొనుగోలుదారులకు డిమాండ్ ఉందని చూపించేందుకు ఖాళీ ఇళ్లలో కూడా లైట్లు వేస్తున్నారనే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏం జరుగుతోంది? ఒకప్పుడు భారీగా లాభాలు తెచ్చిన ఈ రంగం ఇప్పుడు ఎందుకు ఇబ్బందుల్లో పడింది? తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు 1.15 లక్షల నుంచి 1.43 లక్షల వరకు గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుత అమ్మకాల వేగం ఇలాగే కొనసాగితే.. కొత్త ప్రాజెక్టులు ఏవీ రాకపోయినా ఈ ఇళ్లన్నీ అమ్ముడుపోవడానికి 28 నుంచి 30 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించినా, వాటికి తగిన స్థాయిలో కొనుగోలుదారులు రావడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది.
మార్కెట్‌లో ఇళ్లకు మంచి డిమాండ్ ఉందని చూపించేందుకు కొందరు బిల్డర్లు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నట్లు సమాచారం. ఎవరూ నివసించని ఖాళీ ఫ్లాట్లలో కూడా రాత్రిపూట లైట్లు వెలిగించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారట. అపార్ట్‌మెంట్‌లో ఎక్కువ ఇళ్లలో జనం ఉంటున్నట్లు బయటకు కనిపిస్తే, కొత్తగా కొనాలనుకునేవారిలో ఆసక్తి పెరుగుతుందనేది వీరి ఆలోచన. అయితే ఇలాంటి ప్రయత్నాలు మార్కెట్‌లో అసలు పరిస్థితిని దాచలేవు.
కోకాపేట వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరం భూమి ధర రూ.30 కోట్ల నుంచి రూ.44 కోట్ల వరకు చేరింది. ఇంత భారీ మొత్తానికి భూములు కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థలు తక్కువ బడ్జెట్ ఇళ్ల కంటే ఖరీదైన ఫ్లాట్ల నిర్మాణానికే ప్రాధాన్యం ఇచ్చాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న లగ్జరీ ఇళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. దీంతో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు సరైన అవకాశాలు తగ్గిపోయాయి.
రెండేళ్ల క్రితం వరకు బిల్డర్లు చెప్పిన ధరలకే కొనుగోలుదారులు ఫ్లాట్లు తీసుకునేవారు. ఇప్పుడు అమ్ముడుపోని ఇళ్లు పెరగడంతో పరిస్థితి మారింది. నేరుగా ఫ్లాట్ ధర తగ్గిస్తే గతంలో కొనుగోలు చేసినవారి నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండటంతో బిల్డర్లు ఇతర మార్గాల్లో రాయితీలు ఇస్తున్నారు. జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించడం, మాడ్యులర్ కిచెన్, ఉచిత పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
ఇప్పటికే అమ్మకాలు మందగించిన సమయంలో హైడ్రా చర్యలు కూడా కొనుగోలుదారుల్లో ఆందోళన పెంచాయి. చెరువులు, నాలాలు, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భూముల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు భూభారతి పోర్టల్‌కు మారే సమయంలో జరిగిన డేటా సమస్యల వల్ల కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలో చేరినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కొందరు యజమానులు తమ సొంత ఇళ్లను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఒకవైపు ఖరీదైన ఫ్లాట్లు అమ్ముడుపోక బిల్డర్లు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు అందుబాటు ధరల్లో ఇళ్లు లేక మధ్యతరగతి కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీనికి తోడు భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్ల సమస్యలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ధరలు అందుబాటులోకి రావడం, ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావడం జరిగితేనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.
Also Read: స్క్రీన్ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!