దేశంలో ధరలు పెరుగుతున్నాయి. దానికి తగిన ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఒక వేళ ఆదాయం పెరిగినా.. అందులో ఎక్కువ శాతం పన్నులకే పోతోంది. జనాలు ఆదాయపన్ను కడుతూనే.. తాము కొనుగోలు చేస్తున్న వస్తువులకు జీఎస్టీ కూడా కడుతున్నారు. ఉద్యోగులే కాదు.. వ్యాపారాలు చేసుకొనేవాళ్లు కూడా ప్రభుత్వానికి భారీగానే సమర్పించుకుంటున్నారు. జనాల సమస్యలతో మనకేంటీ.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా.. లేదా అనేదే పాయింటు అన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జనాలు కూడా కనిపెట్టలేనంతగా హిడెన్ ట్యాక్సులు వేస్తున్నారు. వాటిలో పాప్ కార్న్ ట్యాక్స్ ఒకటి. ఇక మీరు పాప్ కార్న్‌ను ఒకే ఉత్పత్తిగా భావించకూడదు. దాని టేస్టును బట్టి.. రేటు ఉంటుందనే సంగతి తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాల్టెడ్, స్పైసీ, కారామెలైజ్డ్‌ల టేస్ట్ మాత్రమే కాదు.. వాటిపై విధించే ట్యాక్సులు కూడా వేర్వేరుగా ఉంటాయనేది మీరు గుర్తించాలి. లేకపోతే జేబుకు చిల్లే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పాప్ కార్న్ ట్యాక్స్’పై జోరుగా చర్చ జరుగుతోంది. షుగర్ ఎక్కువగా తింటే పన్ను పోటు వస్తుందని తెలుసు.. కానీ, ఇలా షుగర్ పాప్ కార్న్ తింటే ‘పన్ను’ కట్టాల్సి వస్తుందని ఇప్పుడే తెలిసిందంటూ కేంద్రాన్ని ఏకిపారేస్తున్నారు. సాధారణంగా మనం పాప్ కార్న్ అంటే ‘ఒకటే’ అనే భావనలో ఉంటాం. ఫ్లావర్, క్వాంటిటీని బట్టి ఒక రూపాయి అటూ ఇటూ అవుతుందని అనుకొనుకుంటాం. కానీ, ప్రభుత్వం దీన్ని వేరే కోణంలో చూస్తూ.. పన్నులు వడ్డిస్తోంది. సాల్టెడ్ పాప్ కార్న్‌కు ఒక జీఎస్టీ, షుగర్ కలిసిన కారామెలైజ్డ్ పాప్ కార్న్‌కు మరో GST అంటూ నోటికాడ ఫుడ్‌ను లాక్కుంటోంది.
ఇదిగో.. ఇలా దోచేస్తున్నారు
మార్కెట్లో పాప్ కార్న్ చాలా రకాలుగా అమ్మేస్తున్నారు. ముందుగానే ప్యాక్ చేసిన లేబుల్డ్ రెడీ టు ఈట్ స్నాక్స్ (సాల్టెడ్ పాప్ కార్న్) మీద ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ విధిస్తోంది. కారామెలైజ్డ్ పాప్‌కార్న్ మీద 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇదేం లాజిక్కు అని అడిగితే.. ఉప్పు, మసాలా కలిపినవి 12 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకి వస్తాయని, కారామెలైజ్ చేసినవి.. అంటే పాప్ కార్న్‌ను షుగర్‌తో కలిపినప్పుడు.. అది స్వీట్స్ పరిధిలోకి వస్తుందని కొత్త కథ వినిపిస్తున్నారు. అందుకే దానికి 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో పెట్టేశామని గర్వంగా చెబుతున్నారు. అయితే, ఇది కేవలం ప్యాక్ చేసిన పాప్ కార్న్‌కు. అదే మీరు ప్యాకింగ్ చేయని పాప్ కార్న్ కొనుగోలు చేస్తున్నట్లయితే.. 5 శాతం జీఎస్టీ మాత్రమే పడుతుందట.
సో అర్థమైందిగా.. థియేటర్‌లో పాప్ కార్న్ కొనేప్పుడు ఒకసారి ఆలోచించండి. లేకపోతే చేతి చమురు వదిలిపోద్ది. ఈ జీఎస్టీ గురించి తెలిసి.. పాప్ కార్న్ ప్రియులు చాలా బాధపడిపోతున్నారు. పాప్ కార్న్‌ను.. పాప్ కార్న్‌గా చూడాలేగానీ.. ఇలా అందులో కలిపే పదార్థాలతో ముడిపెట్టి విడదీసి మరీ పన్నులు వడ్డించకూడదని అంటున్నారు. ఏదో కొద్దిగా షుగర్ కలిపేస్తే ఏకంగా 18 శాతం జీఎస్టీ వేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఉత్పత్తి ఒక్కటే అయినప్పుడు.. అందులో కలిపిన పదార్థాలను బట్టి జీఎస్టీ ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అంటూ భిన్నత్వంలో ఏకత్వం కోరుకొనే మీరు.. ఇలా ఏకత్వంలో భిన్నత్వాన్ని ఎలా సపోర్ట్ చేస్తారని సెటైర్లు వేస్తున్నారు.
Also Read: 4 లక్షల కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి వారసురాలు, ఇంతకీ ఎవరీ విధి శాంఘ్వీ?
పాత కార్లు కొనాలన్నా కష్టమే..
ఇటీవల జైసల్మేర్‌లో GST కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ స్లాబ్‌లను పెంచేశారు. ఓల్డ్, యూజ్డ్ కార్లను కూడా వదిలిపెట్టలేదు. వాటి విక్రయాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచుతూ షాకిచ్చారు. మీరు ఒక వేళ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే.. ఇకపై భారీగా జీఎస్టీ చెల్లించాల్సిందే. పెట్రోల్, డీజీల్ కార్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఈ జీఎస్టీ వర్తిస్తుంది. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా డీలర్లపైనే పడనుంది. అంతేకాదు.. కొత్త కార్లు కొనే స్తోమత లేక.. వాడేసిన కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేద్దామని భావించేవారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఇలా వదిలేస్తే.. భవిష్యత్తుల్లో మనం పీల్చే గాలిపై కూడా పన్నులు బాదేస్తారేమో అని సామాన్యులు వాపోతున్నారు.