ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేటప్పుడు ప్యాకెట్‌పై కనిపించే చిన్న వివరాలు మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని గుర్తించేందుకు స్పష్టమైన హెచ్చరికలు అవసరమని చాలామంది భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది వినియోగదారులు వార్నింగ్ లేబుల్స్ ప్యాకెట్లపై స్పష్టంగా కనిపించేలా ఉండాలని తెలిపారు.
దేశంలో ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్‌పై అందులోని పదార్థాలు, పోషకాహారం హెచ్చరికలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది వినియోగదారులు వెంటనే వార్నింగ్ లేబుల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఉత్పత్తిలో చక్కెర, ఉప్పు లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే హెచ్చరిక ఉండాలని కోరుతున్నారు. ఒక్క పోషక పదార్థం ఎక్కువగా ఉన్నా హెచ్చరిక లేబుల్ ఉండాలని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సుప్రీంకోర్టుకు ఒక ప్రతిపాదన సమర్పించింది. ప్యాకెట్ ముందు భాగంలోనే ఎక్స్‌ట్రా అదనపు చక్కెర, ఉప్పు, సాచురేటెడ్ ఫ్యాట్స్ వివరాలను చూపించాలని ప్రతిపాదించింది. ఈ హెచ్చరికల కోసం ఎరుపు రంగు హెక్సాగన్ గుర్తులను ఉపయోగించాలని సూచించింది. వాటిపై “హై షుగర్”, “హై సాల్ట్”, “హై ఫ్యాట్” వంటి హెచ్చరికలు కనిపించేలా గుర్తులు ఉండాలని చెప్పింది. అధికంగా స్వీట్‌నర్లు కలిగిన కొన్ని డ్రింక్స్‌కు కూడా ప్రత్యేక హెచ్చరికలు ఉండవచ్చు.
FSSAI ఈ కొత్త విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని ప్రతిపాదించింది. మొదటి దశలో కనీసం రెండు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులకు హెచ్చరికలు ఇవ్వనున్నారు. వాటిలో అదనపు చక్కెర, ఉప్పు, అదనపు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అధికంగా షుగర్ కలిగిన కొన్ని డ్రింక్స్ కూడా మొదటి దశలోకి వస్తాయి. అయితే ఒక్క పోషక పదార్థం మాత్రమే ఎక్కువగా ఉన్న ఉత్పత్తులకు మొదట్లో హెచ్చరిక ఉండదు. అలాంటి ఉత్పత్తులకు రెండో దశలో హెచ్చరికలు అందించే అవకాశం ఉంది.
లోకల్ సర్కిల్స్ సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో 23,516 మంది హెచ్చరిక లేబుల్స్‌పై స్పందించారు. వారిలో సుమారు 80 శాతం మంది మొదటి దశ నుంచే హెచ్చరికలు కావాలని కోరారు.
మరో ప్రశ్నకు 23,491 మంది స్పందించారు. వారిలో 88 శాతం మంది హెచ్చరికలు పెద్దగా, స్పష్టంగా కనిపించాలని చెప్పారు. ప్యాకెట్‌ను చూసిన వెంటనే వినియోగదారులకు హెచ్చరిక కనిపించాలని వారు కోరుతున్నారు.
Also Read: మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్
FSSAI ప్రతిపాదన అదనపు చక్కెర, ఉప్పు, అదనపు సాచురేటెడ్ ఫ్యాట్స్ పై దృష్టి పెడుతోంది. అయితే 20,525 మంది స్పందించిన వారిలో 53 శాతం మంది మొత్తం పరిమాణాలను పరిగణించాలని కోరారు. దీంతో ఉత్పత్తిలో ఉన్న పోషక పదార్థాల పూర్తి స్థాయి గురించి వినియోగదారులకు స్పష్టత లభిస్తుంది.
Also Read: పామ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదేనా? రోజుకు ఎంత వాడాలి? దీనివల్ల వచ్చే సమస్యలేమిటీ?
హెచ్చరిక విధానాన్ని త్వరగా అమలు చేయాలని కూడా సర్వేలో చాలామంది కోరారు. 20,068 మంది స్పందించిన వారిలో 88 శాతం మంది 6 నెలల్లో అమలు చేయాలని తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని 328 జిల్లాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు.
టియర్ – 1 ప్రాంతాల నుంచి 45 శాతం, టియర్-2 ప్రాంతాల నుంచి 31 శాతం మంది పాల్గొన్నారు. మిగిలిన 24 శాతం మంది టియర్ – 3, టియర్ – 4, టియర్ – 5 ప్రాంతాలకు చెందినవారు.