Gold and Silver Price: ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేదు. బంగారం అంటే అందరికీ ఇష్టమే. నేలకేసి రుద్దినా పొడి రాలుతుందే తప్ప వెలిసిపోదు కదా. అందుకే ఎవరి మంచి గురించైనా చెప్పాలంటే బంగారంతోనే పోల్చుతారు. పండుగలైనా, పెళ్లిళ్లైనా, ఫంక్షన్లైనా.. తానుండనిదే పని జరగదు కదా. అందుకే రోజురోజుకూ ధరలు ఆకాశాన్నంటేలా పరుగు పెడుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు.. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే.. అప్పటికప్పుడు 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.3000 వరకూ పడిపోయింది. దాంతో ఇకముందు కూడా బంగారం ధరలు తగ్గుతాయనుకున్నారు అంతా.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నన్నే తక్కువ అంచనా వేస్తారా అన్నట్లు రోజురోజుకూ పెరిగిపోతుంది. తగ్గే ధర పదుల్లోనే ఉంటుంటే.. పెరుగుతున్నపుడు మాత్రం వందలు, వేలలో ఉంటోంది. పెళ్లిళ్ల సీజన్ అయిపోయింది కదా. ఇంకా 2-3 నెలల వరకూ ముహూర్తాలు లేవు. దీపావళి పండుగ దగ్గరికొచ్చేసరికి బంగారం ధర పెరుగుతుంది. ఆ లోగా కాస్త తగ్గితే.. ఉన్నంతలో బంగారం కొనాలని ఎదురుచూసేవారి ఆశలపై నీళ్లు చల్లేసింది.
Also Read: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
భారీగా పెరిగిన బంగారం
నిన్న.. అంటే సెప్టెంబర్ 13న 10 గ్రాముల బంగారం ధర రూ.1200 నుంచి రూ.1300 వరకూ పెరగగా.. ఈ రోజు కూడా బంగారం ధర పెరిగి.. మళ్లీ రూ.75 వేలకు చేరువలో ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర పై రూ.400, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.440 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ.68,650కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,890కి పెరిగింది. ఇలాగైతే ఇక బంగారం కొన్నట్లేనని.. ధరల తగ్గుదలపై ఆశలు పెట్టుకున్నవారు నిట్టూరుస్తున్నారు. అసలే పండుగల సీజన్. వినాయకచవితి అవ్వగానే దసరా సందడి మొదలవుతుంది. ఆ తర్వాత 15 రోజులకే దీపావళి. వరుసగా పండుగలు వస్తుండటంతో బంగారానికి గిరాకీ పెరిగింది.
ఆగని వెండి పరుగు
పోనీ వెండైనా కొనేలా ఉందా అంటే.. అది కూడా మళ్లీ లక్షకు చేరువవుతోంది. ఈ ఏడాది మే నెలలో లక్ష దాటేసిన కిలో వెండి ధర ఆ తర్వాత కాస్త తగ్గింది. మళ్లీ జులై నెలలో లక్ష మార్క్ ను దాటింది. త్వరలోనే వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందని అప్పుడే మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో లక్ష నుంచి దిగివచ్చిన వెండి.. మళ్లీ ఆ దిశగా పరుగులు పెడుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.3,500 పెరిగిన వెండి.. శనివారం కిలో వెండిపై ఏకంగా రూ.2000 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.970 ఉండగా.. కిలో వెండి ధర రూ.97,000 కు చేరింది. రెండురోజుల్లోనే వెండి ధర రూ.5,500 పెరిగింది. గడిచిన 10 రోజుల్లో చూస్తే.. సెప్టెంబర్ 7న రూ.2500 తగ్గగా.. ఆ తర్వాతి నుంచి రూ.7,500 పెరిగింది.
బంగారం, వెండి కొనాలనుకునేవారు ఇప్పటికైనా ధరల తగ్గుదల కోసం ఎదురుచూడకుండా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.