Gold Price: దేశంలో బంగారం ధర మాటేంటి? ఇంకా పెరుగుతుందా? తగ్గే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ మాట సగటు సామాన్యుడి నోట బలంగా వినిపిస్తున్నమాట. మార్కెట్ వర్గాలు మాత్రం ధరలు పైపైకి పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. దీంతో మధ్య తరగతి సామాన్యుడికి పసిడి దూరమైనట్టే. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
దేశీయ మార్కెట్‌లో బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ని దాటింది. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలు పసిడి ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడది సామాన్య, మధ్యతరగతి వినియోగదారుల జేబులకు భారంగా మారింది. దీని ప్రభావం బంగారం వ్యాపారులపై ప్రభావం చూపనుంది.
మధ్య తరగతికి దూరంగా బంగారం
పసిడి పేరు ఎత్తగానే ఇల్లాలి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. బంగారం ఎప్పుడు కొంటున్నారని నవ్వుతూ అడుగుతారు. ప్రత్యేకించి పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల సందర్భాల్లో బంగారం కొనుగోలు మామూలే. ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల మధ్య తరగతి ప్రజలు వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల గోల్డ్ షాపుల్లో కొనుగోలు క్రమంగా తగ్గుతోంది.
కొన్ని ప్రాంతాల్లో షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఉద్యోగాలపైనా పడుతోంది. ఉద్యోగులను తగ్గించుకుంటున్న పరిస్థితి అప్పుడే మొదలైంది. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్ వాటిపై ఆసక్తి పెరిగినా, ఆలోచనలో పడ్డారు. బంగారం అంటేనే సంపదకు ప్రతీకగా భావించే భారతీయులు, ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ALSO READ: పసిడి ప్రియులకు తీపి కబురు, తగ్గిన బంగారం ధర
అక్షయ తృతీయ మాటేంటి?
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజంతా శుభ సమయమే. ఆ రోజున బంగారంతోపాటు వెండి వస్తువులు కొనుగోలు చేస్తే శుభప్రదంగా భావిస్తుంటారు దేశీయ మహిళలు. కాకపోతే మార్కెట్లో పుత్తడి ధర లక్షకు అటు ఇటు ఊగిసలాడుతోంది. ఈసారి అక్షయ తృతీయ పండుగకు కొనుగోలు పెద్దగా ఉంచకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
24 క్యారెట్ల తులం బంగారం ధర లక్షకు అటు ఇటు ఉంది. అదే వస్తువు అయితే లక్ష పైమాటే. 22 క్యారెట్ల తులం బంగారం ధర 90 వేల పైమాటే. ఒకవిధంగా చెప్పాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు గోల్డ్ ధరలు ఊహించని షాక్. గడిచిన ఐదేళ్ల నాటి ధరలతో పోలిస్తే ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. దీంతో వినియోగదారులు 24, 22 క్యారెట్లకు బదులు 18, 14 క్యారెట్ మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గ్రాములు తగ్గిస్తారా?
ఒకప్పుడు తులం అంటే 12 గ్రామలు ఉండేదని చెబుతుంటారు. ఇప్పుదని 10 గ్రాములకు చేరింది. రేపటి రోజున 8 గ్రాములు తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు రాక పుత్తడి షాపులు వెలవెలబోతున్నాయి. పసిడి ధరలు చిన్న షాపుల యజమానులకు ఇబ్బందిగా మారిందనే చెప్పవచ్చు. పెరిగిన ధరలతో చిన్న పట్టణాల్లో ఆయా షాపులు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపించవచ్చు.
అక్షయ తృతీయకు ఆఫర్లు పెట్టడంతో చాలామంది ఆయా షాపులు కళకళలాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఓవర్‌గా పరిశీలిస్తే సామాన్యుడు, మధ్య తరగతి కుటుంబాలకు బంగారం అందని దాక్షగా మారింది. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల మాట. లేదంటే బులియన్ సెక్టార్‌కు మందగమనం రావడం ఖాయం.