Gold price in 2025: బంగారం భారతీయుల ప్రియమైన పెట్టుబడి మార్గం. పేదా, ధనిక భేదం లేకుండా అన్ని వర్గాలు వారి స్థోమతకు తగ్గట్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. బంగారం అందమైన అభరణమే కాదు.. అత్యవసరాల్లో ఆదుకునే ఉత్తమ మిత్రుడు కూడా. అందుకే.. మన దగ్గర బంగారానికి గిరాకీ ఎక్కువ. మన దిగుమతుల్లోనూ బంగారం వాటా ఎక్కువగానే ఉంటుంది. సాధారణ రోజుల్లోనే బంగారం కొనేందుకు ఆసక్తి చూపించే భారతీయులకు.. పండగ రోజుల్లో అయితే మరింత ఆసక్తిగా, ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. మరి.. 2025 లో బంగారం.. ఏ బాట పట్టే అవకాశాలున్నాయి.? ధరల పట్టీ పరుగులు పెడుతుందా.? ప్రస్తుత ప్రపంచ అనిశ్చితిలో దిగజారిపోతుందా.? ఈ విషయాలు తెలియాలంటే.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల అంతర్జాతీయంగా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2024లో బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ప్రతిఫలం వచ్చింది. ఏకంగా..23 % లాభాన్ని అందించింది. అక్టోబర్ లో ఆల్ టైమ్ గరిష్ఠం రూ.82,400 వద్దర ట్రేడ్ అయ్యి ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది సైతం ఇదే తీరుగా ధరల్లో పెరుగుదల కనిపించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 79,160 వద్ద కొనసాగుతుండగా.. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఇలానే కొనసాగితే.. దేశీయ పసిడికి మరింత రెక్కలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే.. పది గ్రాములు పసిడి ధర ఏకంగా రూ.85 వేల వరకు వెళ్లవచ్చని.. రూ. 90 వేలకు ఎగబాకినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని చెబుతున్నారు.
బంగారం కొంటున్న బ్యాంకులు
అంతర్జాతీయంగా కీలక ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాలు, బంగారాన్ని అధికంగా సరఫరా చేసే రష్యా వంటి దేశాలు యుద్ధ పరిస్థితుల్లో ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నాయి. ఈ పరిస్థితులు సైతం పసిడి ధరలను నిర్ణయిస్తుందంటున్నారు. అలాగే.. కేంద్ర బ్యాంకులు సైతం పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడులు పెడుతున్నాయి. 2024 అక్టోబర్ లో కేంద్ర బ్యాంకులు రికార్డ్ స్థాయిలో 60 టన్నుల బంగారం కొన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 27 టన్నులు కొనుగోలు చేసింది. ఆ తర్వాత టర్నీ 17 టన్నుల బంగారం, పోలెండ్ 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే 2025లోనూ పసిడి మెరుగైన రాబడి అందించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. 2024తో పోల్చితే.. పసిడి వృద్ధి ఆ స్థాయిలో ఉండకపోవచ్చని కొన్ని మార్కెటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా గతంతో పోల్చితే ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మెరుగుదల, కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణ సమసిపోవడం వంటి కారణాలతో పసిడి పరుగులు గతేడాది అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలోనే ధరల పెరుగుదల, మార్కెట్ విక్రయాలు జరుగుతాయని చెబుతున్నారు.
అలాగే..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం పసిడి పరుగులకు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో ట్రంప్ అధికారం చేపట్టేనాటికి బంగారం ధరలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆయన విధానాలతో ధరల కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు సైతం అలాంటి పరిస్థితులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందుకు సంకేతంగా.. ఇప్పటికే ట్రంప్ గెలుపు నిర్థరణ అయినప్పటి నుంచి క్రిప్టో కరెన్సీకి భారీగా డిమాండ్ పెరిగింది. అలాగే.. బాండ్ల రాబడులు సైతం పెరగడంతో పెట్టుబడిదారులు, మదుపర్లు బంగారం కొనుగోళ్లు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం విధాన నిర్ణయాలు కలిసొచ్చేనా..
భారత్ లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు బంగారం ధరలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు.. మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పసిడిపై ఇంపోర్ట్ ట్యాక్స్ ను ఏకంగా 6 % తగ్గించారు. దాంతో.. ఇది 7 % నికి పరిమితమైంది. ఈ కారణంగా 10 గ్రాముల పసిడి ధర పై ఏకంగా రూ.5 వేలు తగ్గింది. దాంతో.. దేశవాసులు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో భారీగా పసిడి విక్రయించేందుకు ముందుకు వచ్చారు. దీంతో.. గతేడాది 2024లో ఆభరణాల కొనుగోళ్లు దాదాపు 17 శాతం మేర పెరిగాయి. ఈ విషయాన్ని వెల్లడించిన మార్కెట్ల వర్గాలు.. దేశంలోని అన్ని నగరాలకు విస్తరిస్తున్న పేరున్న సంస్థల కారణంగానూ బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా.. ఈ ఏడాది బంగారంపై పెట్టుబడులు పెడితే.. మంచి లాభాలు గడించవచ్చని చెబుతున్నారు.. మార్కెట్ విశ్లేషకులు. మరింకెందుకు ఆలస్యం.. మీ జేబులో పొదుపు చేసిన డబ్బును.. బంగారంపైకి మళ్లించండి. మంచి రాబడులు సాధించండి అని ఆహ్వానిస్తున్నాయి.. మార్కెటింగ్ వర్గాల.