Game Changer : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మెగా ఫ్యామిలీకి సన్నిహితుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి ఆయన ఆప్తులు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ అవుతున్న తరుణంలో చెర్రీ సల్మాన్ ఖాన్ ని గట్టిగానే వాడుకుంటున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సల్మాన్ షోలో రామ్ చరణ్ గెస్ట్ గా కనిపించబోతున్నాడు.
పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అంటే ప్రమోషన్స్ పరంగా కావలసిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు మేకర్స్. ముఖ్యంగా ప్రతి భాషలోనూ పాపులర్ షోలలో టీం అంతా పాల్గొంటారు. అప్పుడే కదా ఆ సినిమా ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యేది. అందుకే ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీని వాడుతూ ఉంటారు. అయితే మిగతా భాషల్లో ఒక ఎత్తైతే, హిందీలో మాత్రం మరో ఎత్తు ఈ ప్రమోషన్స్. తెలుగుతో పాటు హిందీ బెల్ట్ లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన సినిమా చరిత్రను సృష్టించడం ఖాయం.
అందుకే పాన్ ఇండియా సినిమాల మేకర్స్ హిందీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారు. ఇక మంచి పలుకుబడి ఉండే హీరోలు ఇతర భాషల్లోని స్టార్ హీరోలను కూడా వాడేస్తుంటారు. తాజాగా రాంచరణ్ కూడా అలాంటి పని చేస్తున్నారు. జనవరి 10న థియేటర్లలోకి రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్ కోసం హిందీలో సల్మాన్ ఖాన్ ను ఆయన వాడుకోబోతున్నారు. అదెలాగంటే…
ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ పోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 (Bigg Boss 11) కి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎండింగ్ కి చేరుకోగా, ఈ వీకెండ్ లో ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ లో ‘గేమ్ ఛేంజర్’ టీం సందడి చేయబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు బిగ్ బాస్ 11 హిందీ వేదికపై సల్మాన్ ఖాన్ తో పాటు రామ్ చరణ్, కియారా అద్వానీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఈ ఎపిసోడ్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీని చెర్రీ – సల్మాన్ కలిసి ప్రమోట్ చేయబోతున్నారు. ఈ స్టార్ స్టడెడ్ ఎపిసోడ్ కోసం ఇప్పటి నుంచే హిందీతో పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ షోకి సంబంధించిన మరో సర్ప్రైజ్ ఏంటంటే… ఈ వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ కూడా గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ని శుక్రవారం రోజు షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ టీం ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ అనే సెలబ్రిటీ టాక్ షో షూటింగ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా… సల్మాన్ – రామ్ చరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో అతిథి పాత్ర చేశారు. ఆ తర్వాత సల్మాన్ ‘కిసీకా భాయ్ కిసికా జాన్’ సినిమాలో ఓ పాటలో రాంచరణ్ గెస్ట్ గా కనిపించారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా రాంచరణ్, అలాగే చెర్రీ ఎప్పుడు ముంబైకి వెళ్లినా సల్మాన్ ఆతిథ్యం ఇస్తారు.