Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా సినిమాలు రిలీజ్ కి ముందు ప్రమోషన్ కంటెంట్ తో వార్తల్లో నిలుస్తాయి. కానీ ‘గేమ్ ఛేంజర్’ మాత్రం వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు అందరూ ఈ మూవీ ట్రైలర్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, మరోవైపు ఈ మూవీని ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే… ఆ తర్వాత చెర్రీ దగ్గరికి వచ్చి పడిందనే వార్త వినిపిస్తోంది.
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. మూవీకి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా అనుకున్న దానికంటే గట్టిగానే బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో అందరూ ఈ రోజు రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అంతలోనే ‘గేమ్ ఛేంజర్’ మూవీని ఓ తమిళ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ని ముందుగా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) కి వినిపించారట డైరెక్టర్ శంకర్. కానీ కారణం ఏంటో తెలీదు గానీ ఆయనతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని తెలుస్తోంది. దీంతో ఆ తర్వాత స్టోరీ చెర్రీ దగ్గరకు చేరిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో విజయ్ హీరోగా నటించిన మరో మూవీని కంపేర్ చేసి చూస్తున్నారు నెటిజన్లు.
రీసెంట్ గా విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time) అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఆల్మోస్ట్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో కూడా ఇలాగే రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఎంతోమంది స్టార్ హీరోలు ఇప్పటిదాకా డ్యూయల్ రోల్స్ చేసినప్పటికీ, ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మాత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీకి ముడిపెట్టి నెటిజన్లు చూస్తుండడం గమనార్హం.
ఇలా ఎందుకంటే… విజయ్ అప్పటికే ‘గోట్’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మరోసారి డ్యూయల్ రోల్ అంటే రొటీన్ గా ఉంటుందనే కారణంతో ‘గేమ్ ఛేంజర్’ను రిజెక్ట్ చేశారని, ఇప్పుడు అదే స్టోరీని రామ్ చరణ్ చేస్తున్నాడు అని అంటున్నారు. సాధారణంగానే ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా, మరో హీరో దగ్గరకు చేరడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. మరి ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఈ సినిమాలో చెర్రీ నటనకు నేషనల్ అవార్డు రావడం ఖాయమని అంటున్నారు మెగా ఫాన్స్.