Gold Rate Today: నిన్న పెరిగింది.. మొన్న పెరిగింది.. అంతకుముందు పెరిగింది.. ఇలా పెరుగుతూనే ఉంది. పెరిగి.. పెరిగి.. లక్ష దాటింది. అక్కడితో ఆగుతుందనుకుంటే.. అస్సలు ఆగట్లేదు.. పుష్ప మాదిరిగా తగ్గేదే లేదంటోంది. అసలు.. బంగారం రేటు ఇంతలా ఎందుకు పెరుగుతోంది? ఈ గోల్డ్ రన్.. ఇప్పట్లో ఆగుతుందా?
ప్రతి రోజూ ఎంతో కొంత పెరుగుతున్న గోల్డ్ రేటు..
ఏ అమావాస్యకో.. పౌర్ణమికో.. ఎంతో కొంత పెరిగి చర్చకు దారితీసే బంగారం రేటు.. ఇప్పుడు రోజూ పెరుగుతోంది. అలా.. పెరిగి, పెరిగి.. లక్ష 20 వేలు దాటిపోయింది. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020 కాగా.. బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,23,170 వద్ద కొనసాగుతుంది. అలాగు.. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,850 కాగా.. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,900 వద్ద ఉంది.
నేటి వెండి ధరలు..
బంగారం ధరలకు ఏ మాత్రం తగ్గకుండా వెండి కూడా గోల్డ్‌తో పోటీ పడుతోంది. కానీ, నేడు సిల్వర్ ధర కాస్త తగ్గింది.. పెరిగే సమయంలో వేయిలలో పెరుగుతది.. తగ్గే సమయంలో వందలలో తగ్గుతది.. బుధవారం కిలో వెండి..ధర రూ.1, 67,00లకు చేరింది.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు..
బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. ప్రధానంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, భారతదేశంలో నెలకొన్న డిమాండ్ అలాంటి అనేక అంశాలు గోల్డ్ రేటుని పెంచుతూ పోతున్నాయ్. అమెరికా షట్‌డౌన్ కొనసాగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాలతో.. ఇన్వెస్టర్లు తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడం కూడా ఈ పరిస్థితికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, మాంద్యం భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇతర పెట్టుబడుల కంటే బంగారం నమ్మకమైన నిల్వగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్ బ్యాంకులు.. తమ రిజర్వులను మళ్లించడానికి, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయ్. ఈ భారీ కొనుగోళ్లే.. డిమాండ్‌ని పెంచుతున్నాయ్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు కూడా పెట్టుబడిదారులని ఆకర్షిస్తున్నాయ్. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు, వడ్డీ లేని బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇక.. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి బలహీనపడినప్పుడు.. బంగారం దిగుమతి వ్యయం పెరుగుతుంది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరుగుతాయ్.
Also Read: చున్నీతో ఉరేసి ఫెన్సింగ్ పిల్లర్ రాయితో మోది భార్యను చంపిన భర్త
బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగుతుందా?
ఇక.. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గడం కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడిన డాలర్ లాంటి వాటితో.. గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయ్. కొందరు మార్కెట్ నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.