దేశంలో పసిడి ధర భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏప్రిల్ 22న ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలను దాటేసింది. అయితే గతంలో వందేళ్ల క్రితం దీని ధర ఎంత ఉండేది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వందేళ్ల క్రితం
1925లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.18.75 మాత్రమే. కానీ ఈ రోజు, 2025లో, అదే 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350కి చేరుకుంది. ఈ 100 సంవత్సరాల్లో బంగారం ధరలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాయి. 1959లో బంగారం ధర రూ.100ని తాకగా, 1979 నాటికి రూ.1,000కి చేరింది. 2025లో, ఇది రూ.1 లక్ష మార్కును దాటింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ఎప్పటికప్పుడు పెరుగుతుంది తప్ప, తగ్గడం లేదని చెప్పవచ్చు.
బంగారం పెరగడానికి ప్రధాన కారణాలు
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ క్షీణత, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం. ఉదాహరణకు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణలు బంగారం డిమాండ్‌ను మరింత పెంచాయి.
Read Also: Poxiao: బియ్యపు గింజత హార్డ్ డ్రైవ్..రెప్పపాటులో డేటా ట్రాన్స్ …
మీ జీవితంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయ్
మీరు పుట్టిన సంవత్సరం, పెళ్లి చేసుకున్న సంవత్సరం, మీ పిల్లలు పుట్టిన సమయం, లేదా పదవీ విరమణ చేసిన సంవత్సరంలో బంగారం ధర ఎంత ఉందో ఊహించుకోండి. ఉదాహరణకు:
-1960లో పుట్టిన వారికి, బంగారం ధర రూ.111.
-1985లో పెళ్లి చేసుకున్న వారికి, రూ.2,130.
-2000లో పిల్లలు పుట్టిన వారికి, రూ.4,400.
-2020లో పదవీ విరమణ చేసిన వారికి, రూ.48,480.
ఈ రోజు (22 ఏప్రిల్ 2025) హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350, 22 క్యారెట్ల బంగారం రూ.92,910 వద్ద ఉంది. గత 9 నెలల్లోనే ధరలు రూ.22,515 పెరిగాయి, ఇది బంగారం వేగవంతమైన ధరల పెరుగుదలను సూచిస్తుంది.
భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయి?
మీ మనవళ్లు లేదా మనవరాళ్ల పుట్టినప్పుడు లేదా వారి పెళ్లిళ్ల సమయంలో బంగారం ధర ఎంత ఉండవచ్చు? నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరుకోవచ్చు. గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,950 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
2045లో గోల్డ్ రేట్లు..
2030 నాటికి, ఆర్థిక అనిశ్చితులు, డిమాండ్-సరఫరా ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం కారణంగా ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. మీ మనవడు 2045లో పెళ్లి చేసుకుంటే, 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
భవిష్యత్తు కోసం సురక్షిత పెట్టుబడి
బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఇది ఆర్థిక భద్రతకు చిహ్నంగా మారింది. భారతదేశంలో, పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, భారత్‌లో బంగారం డిమాండ్‌లో 50% పెళ్లిళ్ల నుంచే వస్తుంది. అయితే, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనుగోలును జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.
కొంచెం కొంచెం బంగారం
“ఒక్కో చుక్క నీరే సముద్రమౌతుంది” అన్నట్లు, కొంచెం కొంచెం బంగారం కొని దాచడం భవిష్యత్తు తరాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. నిపుణుల సలహా ప్రకారం, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం, హాల్‌మార్క్ బంగారం ఎంచుకోవడం, దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించడం మంచిది.