Gold vs Real Estate Investment: సాధారణంగా అనేక మంది కూడా బంగారం లేదా ప్లాట్ వంటి అంశాలపై పెట్టుబడులు చేయాలని భావిస్తుంటారు. మాములు సమయం వేరు. కానీ ఆర్థికంగా అనిశ్చిత ఉన్న టైంలో మాత్రం సరైన పెట్టుబడిని ఎంపిక చేయడం ప్రతి పెట్టుబడిదారుడికీ సవాలని చెప్పవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఊగిసలాటలు, మరోవైపు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు పెట్టుబడి నిర్ణయాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడి మార్గాలైన రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడిదారులకు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ధర స్థాయిని బట్టి
అయితే ప్రస్తుతం బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ పోతుంది. ఆభరణాల రూపంలో కావచ్చు, లేక బార్‌లు అయినా కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఆర్థిక సంక్షోభాల్లో బంగారం పెట్టుబడి ఒక సెక్యురిటీ మాదిరిగా ఉంటుంది. కానీ వీటి ధర స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ ద్వారా కూడా దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రెండింటిలో కూడా వేటిలో పెట్టుబడులు చేస్తే రిస్క్ లేకుండా ఉంటుంది. దేనిలో మంచి రిటర్న్స్ వస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి
రియల్ ఎస్టేట్ లేదా ప్లాట్ విషయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భూమి లేదా ఆస్తి విలువ పెరుగుదలతో పాటు, అద్దె ఆదాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం గత కొన్ని సంవత్సరాలలో స్థిరమైన వృద్ధిని చూపిస్తోంది. గృహ నిర్మాణం, పట్టణీకరణకు సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడులు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
-రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి సాధారణంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం
-రియల్ ఎస్టేట్ ఆస్తులను తక్షణంగా అమ్మడం కష్టం అవుతుంది. కాబట్టి లిక్విడిటీ అవకాశం తక్కువ
-కొన్నిసార్లు ఆస్తి కొనుగోలులో చట్టపరమైన సమస్యలు రావచ్చు. కాబట్టి న్యాయ సలహా తీసుకోవడం మంచిది
Read Also: Investment Tips: ఇందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే..
బంగారంలో పెట్టుబడి
బంగారం అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించబడింది. ఎందుకంటే ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ కోసం బంగారం.. పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది దీని ఆకర్షణను మరింత పెంచిందని చెప్పవచ్చు.
బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు:
-బంగారం ధరలు స్వల్పకాలంలో మారవచ్చు. కాబట్టి ధరల మార్పులను గమనించడం చాలా ముఖ్యం
-బంగారంను తక్కువ సమయంలో నగదులోకి మార్చుకోవచ్చు. కాబట్టి లిక్విడిటీ ఎక్కువ
-బంగారంపై పెట్టుబడులు డివిడెండ్‌లు లేదా వడ్డీ రూపంలో ఆదాయాన్ని సృష్టించవు
-పెరిగిన సమయంలో కంటే గోల్డ్ తక్కువ ధర ఉన్నప్పుడు కొంటే మేలు
ఆర్థిక లక్ష్యాలు, రిస్క్
రియల్ ఎస్టేట్, బంగారం మధ్య పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టికి అనుకూలంగా ఉంటుంది. అయితే బంగారం స్వల్పకాలిక స్థిరత్వం, ద్రవ్యత కోసం మంచిది. మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ రెండు విషయాల పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు సమయానికి అనుగుణంగా స్ట్రాటజిక్‌గా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తును మరింత భద్రంగా నిర్మించుకోవచ్చు.
నోట్: బిగ్ టీవీ పెట్టుబడులు చేయాలని సూచనలు చేయదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు పెట్టుబడి చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.