Gig Workers Rest Zones| ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు, భోజనమే కాదు గ్రోసరీలు, స్నాక్స్, ఎలెక్ట్రానిక్స్ లాంటివి అన్నీ ఇంటి వరకు తెచ్చిస్తూ.. సమయంతో పోటీ పడీ.. ఎండ, వాన, ట్రాఫిక్ వంటి కష్టాలు దాటుకొని మరీ కస్టమర్లకు కావాల్సినవి డెలివరీ చేసేవారు డెలివరీ బాయ్స్. వీరు పడే కష్టాలను చూసి తాజాగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వీరి కోసం విశ్రాంతి ఏర్పాట్లు చేయబోతోంది. పైగా బిజీ నగరంలో వారు రెస్ట్ తీసుకునేందుకు ఏసీ గదులు, టాయిలెట్స్ వంటి వసతులు ఏర్పాటు చేసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని నగరం చెన్నై లోని మునిసిపల్ కార్పొరేషన్ గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్ స్విగ్గీ, అమెజాన్, జోమాటో, ఫ్లిప్ కార్డ్) కోసం కొత్త వసతులు ఏర్పాటు చేయబోతోంది. ఇలాంటి వసతులు గిగ్ వర్కర్ల కోసం దుబాయ్ ప్రభుత్వం ప్రారంభించగా.. వాటి నుంచి స్ఫూర్తి పొందిన తమిళనాడు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని ప్రధాన సెంటర్లలో డెలివరీ బాయ్స్ కోసం వారికి సౌకర్యాలు ఉండే విధంగా రెస్ట్ జోన్స్ నిర్మించబోతోంది.
గంటల తరబడి రోడ్డుపై ప్రయాణించిన తరువాత వారికి ఉపశమనం కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో మహిళ గిగ్ వర్కర్లు డెలీవరీ ఏజెంట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. గిగ్ వర్కర్లలో మహిళలు కేవలం 10 శాతమే ఉన్నా వారి కోసం కూడా ఏర్పాట్లు చేస్తామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రంగంలో మహిళలు కూడా రాణించేందుకే తాము ప్రోత్సాహకంగా ఈ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
చెన్నైలోని బిజీ సెంటర్లలో గిగ్ వర్కర్ల రెస్ట్ జోన్స్‌ని ఏర్పాటు చేశారు. నగరంలోని అన్నా నగర్, నుంగం బాక్కం, రోయాపెట్టాహ్, మైలాపోర్, టి నగర్ ప్రాంతాల్లో ఈ రెస్ట్ జోన్స్ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గిగ్ వర్కర్లు ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందని తెలిసే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వీటితో పాటు ఎక్కువగా రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు ఉన్న అన్నా సలై, అన్నా నగర్ సెకండ్ అవెన్యూ, ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డు, ఉత్తమర్ గాంధీ సలై, రోయా పెట్టా హై రోడ్డులో కూడా డెలివరీ వర్కర్ల కోసం రెస్ట్ జోన్స్ ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది.
Also Read: ఒక అరటి పండు రూ.500 పైనే.. అక్కడికి వెళితే డబ్బులున్నా ఆహారం కొనలేం
ఒక్కో రెస్ట్ జోన్ 600 చదరపు అడుగులలో ఏర్పాటు చేశామని.. ఇందులో టాయిలెట్స్ (మహిళలకు వేరుగా), ఏసీ రూమ్స్, సీటింగ్ ఏరియా, మొబైల్, ఈవీ వాహనాల చార్జింగ్, మొబైల్ ఫోన్స్ లాంటివి కాసేపు భద్రపరచడానికి లాకర్స్, టూ వీలర్స్ కోసం పార్కింగ్ వసుతులుంటాయి.
రెస్ట్ జోన్స్‌తో చాలా అవసరం
గిగ్ వర్కర్లకు ఈ రెస్ట్ జోన్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. డెలివరీల ఆర్డర్ల కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చినప్పుడు.. ఎండ, వాన, చలి లాంటి విపరీత వాతావరణం ఉన్నప్పుడు కాసేపు తలదాచుకోవడానికి, సేదతీరడానికి, నగరంలో ట్రాఫిక్ మెరుగుపరచడానికి ఈ రెస్ట్ జోన్స్ లాభదాయకంగా మారుతాయి. ఇక్కడ రిఫ్రెఫ్ అయ్యాక తిరిగి వీరంతా ఉత్సాహంతో పనిచేయగలుగుతారు.
అయితే కొన్ని బిజీ సెంటర్లలో ఈ రెస్ట్ ఏర్పాటు చేయడం చాలా ఛాలెజింగ్ గా మారిందని చెన్నై కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. అందుకే లభించే అతి తక్కువ ప్రదేశంలో కూడా నైపుణ్యం ఉన్న ఇంజినీర్ల చేత కాంపాక్ట్ గా రెస్ట్ రూమ్స్ డిజైన్ చేయిస్తున్నామని చెప్పారు. డెలివరీ వర్కర్ల నుంచి కూడా ఈ రెస్ట్ జోన్స్ పై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. ఈ వసతులతో గిగ్ ఎకానమీకి మరింత బూస్ట్ లభిస్తుందని తెలిపారు.