New Gst: ట్రంఫ్ టారిఫ్ పుణ్యమాని జీఎస్టీలో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానికంగా తయారయ్యే వస్తువులకు డిమాండ్ ఏ మాత్రం తగ్గకుండా జీఎస్టీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయ్యింది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పన్ను శ్లాబులను కుదించింది. దీనికి జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జీఎస్టీలో గతం నాలుగు స్లాబులు ఉండేవి. వాటిలో 5, 12, 18, 28 శాతంగా ఉన్న వాటిని ప్రస్తుతం రెండు స్లాబుల్లోకి కుదించారు. వాటిలో 5, 18 శాతంగా ఉండనున్నాయి. అయతే హానికర, విలాస వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను తప్పదు. మరో విషయం ఏంటంటే.. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న ఆరోగ్య, జీవిత బీమాలపై పూర్తిగా జీఎస్టీ రద్దయింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పైనిర్ణయాలను తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాటి వివరాలను వెల్లడించారు. అన్నట్లు దుర్గా నవరాత్రుల తొలిరోజు నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రానుంది.
బుధవారం 10 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పలు సూచనలు చేశాయి. కొత్త జీఎస్టీ కారణంగా పాలు, పప్పులు, దుస్తులు, చెప్పుల వరకు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. రోజూ వినియోగించే కిరాణా సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, దుస్తులు వంటివి వస్తువులు చౌకగా మార్కెట్లో లభించనున్నాయి. ప్యాకెట్ పాలు ఇకపై పన్ను రహితం కానున్నాయి. ప్రస్తుతం వాటిపై 5 శాతం వరకు పన్ను ఉంది. కండెన్స్‌డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పనీర్, చీజ్ లాంటి 12 శాతం నుంచి 5 శాతం స్లాబులోకి వచ్చేశాయి. పాస్తా , కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, బాదం, పిస్తా, జీడిపప్పు, కూరగాయల నూనెలు, భుజియా వంటి ప్యాకేజ్డ్ పదార్థాలు ఇప్పటివరకు 12 లేదా 18 శాతం ఉండేవి. సెప్టెంబర్ 22 నుంచి 5 శాతానికి తగ్గనుంది. అలాగే మినరల్ వాటర్, ఏరేటెడ్ వాటర్ కూడా 5 శాతానికి పరిమితంకానుంది.
ప్రస్తుతం వెయ్యి లోపు దుస్తులు, చెప్పులు, బూట్లపై 5 శాతం ఉండేది. ఆపై ధర ఉంటే 12 శాతం పన్ను వసూలు చేసేది ప్రభుత్వం. కొత్త జీఎస్టీ ప్రకారం రూ.2,500 వరకు వస్త్రాలు, చెప్పులపై 5 శాతం పన్ను అమల్లోకి రానుంది. రూ.2,500 పైన ఉండే దుస్తులు, చెప్పులపై 18 శాతం పన్నులోకి వెళ్లనున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేసింది జీఎస్టీ కౌన్సిల్. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీలపై జీఎస్టీని రద్దు చేసింది. దీని నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.16 వేల కోట్లు వసూలయ్యేది. ఇక జీవిత బీమా నుంచి రూ.8 వేలు, ఆరోగ్య బీమా నుంచి రూ.8 వేల 200 కోట్లు పన్ను రూపంలో ఆదాయం వచ్చేది. అలాగే రకరకాల వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ కిట్లు వాటిపై 12శాతం నుంచి 18 శాతం వరకు పన్నులు ఉండేవి. ఇప్పుడు వాటిని 5 శాతం పరిధిలోకి తెచ్చారు. కేన్సర్, అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది.
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు, విడిభాగాలపై జీఎస్టీ తగ్గించింది. వాటిపై ప్రస్తుతం 28 శాతం ఉండగా, 18శాతానికి తీసుకొచ్చింది. వాటిలో కార్లతోపాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలు దిగిరానున్నాయి. విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్‌ను ఎత్తివేసింది. వాటి ధరలు కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లపై 5 శాతం పన్ను కంటిన్యూ కానుంది. 350 సీసీ సామర్థ్యంలోపున్న టూ వీలర్స్ వాహనాలను 28 నుంచి 18 శాతానికి మార్చారు. అవి కూడా సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి.