Biochar Concrete: మానవ వ్యర్థాలను ఉపయోగించి సాధారణ కాంక్రీట్ కంటే మరింత దృఢమైన కొత్త రకం కాంక్రీట్‌ను భారతీయ శాస్త్రవేత్తలు తయారుచేశారు. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధి రఘువేష్ తివారీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్ మురుగునీటి శుద్ధి ప్లాంట్ నుండి సేకరించిన మానవ వ్యర్థాలతో రూపొందించిన ‘బయోచార్’ (Biochar) ను దీని కోసం ఉపయోగించారు.
తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో సేంద్రీయ పదార్థాన్ని వేడి చేయడం ద్వారా కార్బన్ సమృద్ధిగా ఉండే ‘బయోచార్’ తయారు చేస్తారు. ఈ పరిశోధనలో భాగంగా సేకరించిన మురుగునీటి సేంద్రీయ వ్యర్థాలను (Sewage Sludge) ముందుగా ఎండబెట్టారు. ఆ తర్వాత 350 నుండి 450 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి సన్నని పౌడర్‌గా మార్చారు.
అనంతరం పరిశోధకులు కాంక్రీట్ మిశ్రమంలో సిమెంట్ పరిమాణాన్ని 5%, 10%, 15% మేర తగ్గించి దానికి బదులుగా ఈ బయోచార్‌ను కలిపారు. అనంతరం ఈ శాంపిల్స్ బలం, నీటిని పీల్చుకునే తత్వం, నాణ్యతను పరీక్షించారు.
5% బయోచార్ కలిపిన మిశ్రమం 91 రోజుల క్యూరింగ్ తర్వాత.. ఈ కాంక్రీట్ ఒత్తిడిని తట్టుకునే శక్తి 20% పెరిగింది. అలాగే వంగే గుణాన్ని తట్టుకునే శక్తి 36% పెరిగింది. అటు 10% బయోచార్ కలిపిన కాంక్రీట్ వంగే శక్తి గరిష్టంగా 42% వరకు పెరగ్గా.. ఒత్తిడిని తట్టుకునే శక్తి 21% పెరిగింది.
బయోచార్ మిశ్రమం కలిపిన కాంక్రీట్ దృఢంగా మారడానికి గల కారణాలను పరిశోధకులు తెలియజేశారు. వారి ప్రకారం.. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు నీటిని పీల్చుకుని, కాంక్రీట్ గట్టిపడే సమయంలో నెమ్మదిగా నీటిని విడుదల చేస్తాయి. దీనివల్ల కాంక్రీట్ బలాన్ని పెంచే రసాయన చర్యలు బాగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా బయోచార్‌లోని సిలికా పదార్థం కూడా కాంక్రీట్ దృఢత్వానికి దోహదపడుతుందోని పేర్కొన్నారు. అయితే బయోచార్‌ను 15% వరకు పెంచినప్పుడు కాంక్రీట్‌లో రంధ్రాలు, పగుళ్లు ఏర్పడి దాని బలం తగ్గడాన్ని పరిశోధకులు గమనించారు.
Also Read: అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!
ఈ సాంకేతికతను భవన నిర్మాణాల్లో నేరుగా ఉపయోగించే ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉప్పు నీటి ప్రభావం, మంచు కురిసే వాతావరణ పరిస్థితులలో ఈ కాంక్రీట్ ఎలా పనిచేస్తుందో పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే మురుగు వ్యర్థాల నుండి భార లోహాలు (Heavy Metals) విడుదలయ్యే అవకాశం ఉందా అనే కోణంలో కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
Also Read: జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!