Merge PF Accounts: ఇటీవల కాలంలో అనేక మందికి ఉద్యోగాలు మారడం అనేది సర్వ సాధారణమైంది. అయితే, ఉద్యోగం మారినప్పుడు లేదా కొన్ని సందర్భాలలో ఉద్యోగి వేరే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో కొత్త EPF ఖాతా తెరుస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ EPF ఖాతాలు ఉంటాయి. ఇది కొన్నిసార్లు అభ్యర్థులకు అసౌకర్యాన్ని కల్గిస్తుంది. ఎలాగంటే ఆయా ఖాతాల నుంచి నిధులను వాడుకునే విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ఖాతాలన్నింటిని విలీనం చేయడం ద్వారా మీరు ఆ మొత్తాలను ఒకే ఖాతాలలోకి వచ్చే విధంగా చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
EPF ఖాతాలను ఆన్‌లైన్‌లో విలీనం చేయడం ఎలాగంటే
-ముందుగా, మీరు EPFO (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in ను సందర్శించాలి. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు EPF ఖాతా విలీనం ప్రక్రియ ప్రారంభించవచ్చు.
-EPFO పోర్టల్‌లో లాగిన్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, ఆఫ్‌లైన్ లింక్డ్ మొబైల్ నంబర్ అవసరం. ఈ వివరాలతో లాగిన్ అయ్యే ముందు, మీకు UAN నంబర్ నమోదు చేసి, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
-లాగిన్ అయిన తర్వాత, ప్రధాన డాష్‌బోర్డు పై “ఆన్‌లైన్ సేవలు” అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ “వన్ మెంబర్-వన్ EPF ఖాతా” అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిపై క్లిక్ చేయడం ద్వారా EPF ఖాతాలను విలీనం చేసే పేజీకి మీరు వెళతారు.
-అక్కడ మీ ప్రస్తుత EPF ఖాతా, UAN, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయండి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ పాత ఖాతా వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
-ఆ తర్వాత, మీ ధృవీకరణ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది. ఆ OTPని EPFO పోర్టల్‌లో నమోదు చేసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి.
-ధృవీకరణ తర్వాత, కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో, మీరు విలీనం చేయాలనుకున్న పాత, కొత్త EPF ఖాతా వివరాలను జాగ్రత్తగా ఇవ్వండి. వివిధ ఖాతాల వివరాలు, వాటి UANలను సరైన క్రమంలో ఎంచుకోవాలి.
-ఆ తర్వాత డిక్లరేషన్ పేజీ వస్తుంది. ఇందులో మీరు ఏ రెండు లేదా మూడు ఖాతాలను విలీనం చేస్తున్నారో చెప్పాలి. మీరు అన్ని షరతుల్ని అంగీకరించిన తర్వాత “సమర్పించు” బటన్‌పై క్లిక్ చేయండి.
Read Also: Air cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్.. …
కంపెనీ ఆమోదం కూడా
-EPFO ద్వారా మీరు చేసిన విలీనం అభ్యర్థనను మీ ప్రస్తుత యజమాని (ఆర్గనైజేషన్) కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని వారు ఆమోదించిన తర్వాత, EPFO ఆటోమేటిక్గా మీ ఖాతాలను ప్రాసెస్ చేసి విలీనం (మెర్జ్) చేస్తుంది.
-పూర్తిగా విలీనం జరిగే ప్రక్రియ సాధారణంగా వారం రోజుల్లోపు పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు EPFO పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ అకౌంట్ స్థితిని చెక్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో మీరు ఒకే EPF ఖాతాలో మెర్జ్ అయిన మొత్తాన్ని చూస్తారు.
మీ EPF ఖాతాలను ఇమెయిల్ ద్వారా కూడా విలీనం చేసుకోవచ్చు
మీరు ఇమెయిల్ ద్వారా కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ PF ఖాతాలను విలీనం చేసుకోవచ్చు. దీని కోసం మీరు uanepf@epfindia.gov.in కు ఒక ఇమెయిల్ పంపించాలి. అందులో మీరు మీ ప్రస్తుత, పాత UANలను స్పష్టంగా తెలియజేయాలి. దీంతోపాటు ఏ ఖాతాలను దేనిలో విలీనం చేయాలనే విషయాలను ప్రస్తావించాలి. మీ అభ్యర్థనను EPFO ధృవీకరించిన తర్వాత, వారు పాత UANలను మెర్జ్ చేసి ఒకే ఖాతాకు బదిలీ చేస్తారు.