Hyderabad House Sales : విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో ఇళ్లు కొనుగోలు చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జీవన విధానాానికి ఆకర్షితులై చాలా మంది హైదరాబాద్ లో సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగానే.. గతేడాది ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాల్లో భాగ్యనగరం సరికొత్త రికార్టు సొంత చేసుకుంది. ఏకంగా అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12% వృద్ధి సాధించింది. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న విక్రయాలు తగ్గాయనే ఆరోపణలను ఈ గణాంకాలు కొట్టిపారేస్తున్నాయి.
గతేడాది కొత్త నిర్మాణాలు, విక్రయాలపై స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. ఇందులో పూర్తి వివరాలు ఉండగా.. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని నిర్మాణాలు మొదలైయ్యాయి. ఎక్కడ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి వంటి అన్ని వివరాలు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారమే.. భాగ్యనగరంలో 2023 తో పోల్చితే విక్రయాలు పెరిగినట్లు స్పష్టమవుతుంది. 2024లో కొత్తగా 44,013 నిర్మాణ పనులు పట్టాలెక్కగా, అందులో 36,974 ఇళ్లు అమ్ముడుపోయినట్లు ఈ నివేదికల వెల్లడిస్తోంది.
దేశంలోని 8 ప్రధాన నగరాల్లోని ఇళ్లు / ప్లాట్ల విక్రయాలపై నైట్ ఫ్రాంక్ వివరాలు వెల్లడించగా.. అందులో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 2024లో మొత్తంగా 3 లక్షల 50 వేల 613 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అంతుకు క్రితం ఏడాదితో పోల్చితే ఇది.. 12 ఏళ్ల గరిష్ఠమని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. కాగా.. మిగతా నగరాల్లో విక్రయాల్లో మంచి వృద్ధి సాధించగా.. దిల్లీ రాజధాని నగరంలో మాత్రం విక్రయాలు పడిపోయినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల విక్రయాలు 4% తగ్గగా.. ముంబయిలో 11%, బెంగళూరులో 2%, అహ్మదాబాద్‌లో 15%, కోల్‌కతాలో 16%, పుణెలో 6%, చెన్నైలో 9% ఇళ్ల విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఇందులోనూ రూ.2-5కోట్ల మధ్య ఇళ్లకు మంచి గిరాకీ ఉన్నట్లు నివేదిక తెలుపుతోంది.
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల విక్రయాలతో పాటు ధరలు సైతం పెరిగినట్లు గుర్తించారు. అన్ని రకాల ఇళ్లపై సగటున 8% ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున ప్రారంభమైన ఎల్ బీ నగర్, కొంపల్లిలో ఇళ్ల ధరలు పెరుగుతుండగా… ఎల్‌బీనగర్‌లో ఏడాది కాలంలో సగటున 11%, కొంపల్లిలో 10% వరకు ధరలు పెరిగాయి.
నగరంలో విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. గతేడాది విక్రయాల్లో ఏకంగా రూ.1-2 కోట్ల విలువైనవి 45% ఉన్నాయి. గత ఏడాదిలో ఈ శ్రేణిలోనివి 16,459 ఇళ్లు అమ్ముడుకాగా.. ఇప్పుడు వాటి వాటా పెరగడం స్పష్టంగా ప్రజల ఆసక్తిని తెలుపుతోంది. అలాగే.. రూ.2-5 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాల్లో 72%, రూ.5-10 కోట్ల ఇళ్ల అమ్మకాల్లో 39%, రూ.10-20 కోట్ల గృహాల్లో 51% వృద్ధి కనిపించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.
Also Read :
కాగా.. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం స్థలాలు, చెరువులు, కాలువల సంరక్ష కోసం పనిచేస్తున్న హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆచితూచి నిర్మాణాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ స్థలాలు, చెరువుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. గతంలో.. కొంత మేర నిర్మాణాలు చెరువుల భూములు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా, మరికొందరు హడావిడిలో నిర్మాణాలు చేసేవారని, కానీ.. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.