World Billionaire count 2024 – India: ఇండియాలో బిలియనీర్లు పెరుగుతున్నారా? దశాబ్దంగా బిలియనీర్లు సంఖ్య రెట్టింపు అయ్యిందా? బిలియనీర్లు ఆస్తులు మూడు రెట్లు పెరిగాయా? మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే దీనికి కారణమా? అవుననే అంటున్నాయి నివేదికలు.
మోదీ పాలనలో డబ్బులున్నవారి సంఖ్య పెరుగుతోందని, పేదవాడిలో ఏ మాత్రం మార్పు రాలేదంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా మోదీ సర్కార్ అవేమీ పట్టించు కోలేదు. చేయాల్సిన పనిని సైలెంట్‌గా చేసుకుంటూపోతోంది.
UBS బిలియనీర్ ఆంబిషన్స్ రిపోర్ట్ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగు తుండగా, చైనా సెకండ్ ప్లేస్. కాకపోతే బిలియనీర్ల సంపద, సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ఇక ఇండియా మూడోస్థానంతో సరిపెట్టుకుంది. అంటే బిలియనీర్ల హబ్‌గా భారత్ మారుతోందన్నమాట.
ఇండియాలో బిలియనీర్లు రెట్టింపు కాగా, వారి ఆస్తులు మూడు రెట్లు పెరిగాయని ప్రస్తావించింది. భారతీయ బిలియనీర్ల సంపద 42% పెరిగి 905 బిలియన్ల డాలర్లకు చేరింది. కుబేరులు పెరగడం వెనుక కుటుంబ వ్యాపారాల్లో వృద్ధి సాధించినట్టు పేర్కొంది. ముఖ్యంగా మార్కెట్లో లిస్టింగ్‌కు వెళ్లడం కారణంగా ప్రస్తావించింది. ఫార్మాస్యూటికల్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫుడ్ డెలివరీ కీలకంగా మారాయి.
భారత్ బిలియనీర్ల తప్పితే.. గ్లోబల్ వ్యాప్తంగా బిలియనీర్ల సంపద మందగించింది. భారత్ వ్యాపారాలకు సానుకూల వాతావరణం దీనికి ఓ కారణం. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత తోడ్పడింది. రెండుసార్లు దేశాన్ని పాలించిన మోడీ సర్కార్ తీసుకొచ్చిన నిర్మాణాత్మక సంస్కరణలు ఊతమిచ్చాయి. ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా నడిపించడంలో దోహదపడిందని తెలిపింది.
ఇంకో కోణంలో పరిశీలిస్తే.. భారత్‌లో పెరుగుతున్న పట్టణీకరణ, డిజిటల్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, పారిశ్రామిక వృద్ధి ఇవన్నీ కారణాలుగా పేర్కొంది. 2020కి ముందు చైనాలో బిలియనీర్లు పెరిగినట్లుగా రాబోయే పదేళ్లులో భారత్‌లోనూ కుబేరులు పెరగవచ్చని అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద 2015-24 మధ్యకాలంలో 121 శాతం పెరిగి 14 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇక బిలియనీర్ల సంఖ్య 1,757 నుండి 2,682కి పెరిగింది. ఈ సంఖ్య 2021లో గరిష్టంగా 2,686కి చేరింది. అయితే 2020 నుండి క్రమంగా వృద్ధి మందగిస్తూ వచ్చింది. కుబేరుల సంపద ఏడాది ఒకశాతం పెరిగింది.
చైనా కుబేరుల సంపద 2020 నుండి 16 శాతానికి క్షీణిస్తూ వస్తోంది. అదే సమయంలో అమెరికా, యూరప్, మిడిలిస్ట్, ఆఫ్రికా, ఆసియాలోని ముఖ్యంగా భారతదేశం నిరంతర వృద్ధిని కనబరుస్తూ వస్తోంది. 2015 నుంచి టెక్ బిలియనీర్లు సంపద అత్యధికంగా 2.4 ట్రిలియన్లకు చేరింది.
వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్‌సెక్యూరిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, రోబోటిక్స్‌లో పురోగతికి కారణం. అలాగే పారిశ్రామిక బిలియనీర్లు కూడా గణనీయమైన వృద్ధిని సాధించారు. కాకపోతే రియల్ ఎస్టేట్ బిలియనీర్లు కాసింత వెనుకబడి ఉన్నారనేది రిపోర్టులో మరో కీలకమైన పాయింట్.