Electronics Exports : ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యక్షంగా కొంత భారాన్ని మోపుతుంటే.. పరోక్షంగా మరికొంత లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆ కోవలోకే వస్తున్నాయి.. దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు. ట్రంప్ దూకుడుగా పన్నులు విధిస్తున్న వేళ.. చైనా వస్తువులపై తాజాగా 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆదేశ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్స్ పై భారీగా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. ఆ స్థానంలో అత్యంత నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఉత్పత్తుల్ని భారత్ లో తయారీ సంస్థలు అమెరికాకు అందించనున్నాయి.
కొన్నేళ్ల క్రితం వరకు భారత్ ఇతర దేశాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పుత్తులు దిగుమతి చేసుకుంటుండేది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను అయితే సగాని కంటే ఎక్కువగానే విదేశాల నుంచి తెప్పించుకునేది. కానీ.. కొవిడ్ కు ముందు తర్వాత భారత్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్పుత్తులు భారీగా ఉత్పత్తి అవుతున్నాయి. మన దేశీయ అవసరాలు తీర్చమే కాకుండా కొద్ది మేర విదేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. అనుకోకుండా కలిసి వచ్చిన చైనాపై అధిక పన్నుల విధానంతో దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విస్తరించేందుకు అనూహ్యంగా అవకాశం ఏర్పడినట్లైంది అంటున్నారు. తాజా పరిణామాలపై పరిశ్రమ వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాలోకి భారీగా అక్రమ వలసల్ని ప్రోత్సహించడం, సరిహద్దు చొరబాట్లు సహా.. తమ వస్తువులపై భారీగా పన్నులు వేస్తున్నారంటూ కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీగా పన్ను వడ్డనలు చేశారు. చైనాపై కొంత పరిమితంగానే పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆయా దేశాల నుంచి ఇప్పుడు వస్తున్న వస్తువులకు ప్రత్యామ్నాయాలపై అమెరికా సంస్థలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. వాటిలో ఎలక్ట్రానిక్స్ అగ్రస్థానంలో ఉంటాయి. ఈ వస్తువుల్ని అందుబాటు ధరల్లో పొందాలంటే అమెరికా సంస్థలు దేశీయంగానే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ.. ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి తక్కువ రేట్లకు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతాయి. ఇతర దేశాల్లో అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులో ఉండడంతో.. దిగుమతులకు అన్వేషిస్తుంటాయి. ఇదే ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు వరంగా మారింది అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ – ఉత్పత్తి ఆధారిత పోత్సాహ పథకాన్ని అనుసరిస్తోంది. అంటే.. ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువగా ప్రోత్సహకాల్ని అందిస్తుంటారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించడంతో పాటు దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడం ఈ పథకం ఉద్దేశ్యం. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, ఔషధ ఉత్పత్తులు, ఆటోమొబైల్, సౌర ప్యానెల్లు, సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్, టెలికం ఎక్విప్‌మెంట్ తదితర రంగాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. దాంతో.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ఏటికేటా భారత్ ఉత్పత్తులు భారీగా పెరిగిపోతున్నాయి. రక్షణ రంగంలోని ఎలక్ట్రానిక్స్ కూడా ఇటీవల కాలంలో భారీగా ఎగుమతులకు నోచుకుంది.
Also Read : బంగారం ధర తగ్గుతుందా.. పెరుగుతుందా.. ఫ్యూచర్ పరిస్థితి ఇదే..!
ప్రస్తుతం భారత్ నుంచి అధికంగా ఎగుమతులు సాధిస్తున్న రంగాల్లో ఎలక్ట్రానిక్స్ మూడవ స్థానానికి చేరుకుంది. అంటే ఇక్కడి అవసరాలు సమృద్ధిగా తీరిన తర్వాతనే ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ మంచి అభివృద్ధిని, పెట్టుబడుల్ని, ఉద్యోగాల్ని సాధిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.