YS Viveka Case Update: మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ వివేకా హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కీలక పరిణామంతో ఈ కేసు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఫిర్యాదుతో ఏకంగా ముగ్గురు పోలీస్ అధికారులపై కేసు నమోదు కావడం విశేషం.
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దస్తగిరిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు 2023లో తరలించారు. ఆ సమయంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కేసు దర్యాప్తు సాగించారు. అయితే దస్తగిరిని జైలులో ఇదే కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి కలిసి మభ్యపెట్టినట్లు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఈ కేసుకు సంబంధించి అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని చెప్పాలని, రామ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని చైతన్య రెడ్డి రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు. అలాగే తనను కొందరు పోలీస్ అధికారులు, నిందితులకు సపోర్ట్ చేయమని ఒత్తిడి తెచ్చినట్లు కూడ దస్తగిరి ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది.
తాజాగా పోలీసులు వివేకా హత్య కేసుపై దృష్టి సారించిన నేపథ్యంలో, దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు తెరమీదికి వచ్చింది. దీనితో జమ్మలమడుగు డిఎస్పీగా గతంలో పనిచేసిన నాగరాజు, గతంలో ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపర్డెంట్ ప్రకాష్ , డాక్టర్ చైతన్య రెడ్డిలపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకంగా ముగ్గురు పోలీసు అధికారులపై కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: AP Pension Scheme: మీరు పింఛన్ పొందుతున్నారా.. ఇది తప్పక తెలుసుకోండి.. వెంటనే ఇలా చేయండి
కాగా ఇటీవల వివేకా హత్య కేసు గురించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా మరణించిన సమయంలో తాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశానని, అయితే అవినాష్ రెడ్డి ఫోన్ వేరొకరికి ఇవ్వగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు తనకు ఫోన్ లో తెలిపారని సాయి రెడ్డి తెలిపారు. ఇలా సాయి రెడ్డి కామెంట్స్ చేసిన సమయంలో వివేకా హత్య కేసు వార్తల్లో నిలవగా.. తాజాగా దస్తగిరి ఫిర్యాదు తో మరో మారు ఈ కేసు హైలెట్ గా మారింది.