Narayana Murthy 70-Hour Workweek | ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 పనిగంటల గురించి మళ్లీ వ్యాఖ్యానించారు. గతంలో ఆయన ఉద్యోగలందరూ వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పగా.. దానికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే నారాయణ మూర్తి ఆదివారం డిసెంబర్ 15, 2024 కోల్‌కతా నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తాను చేసిన పనిగంటల ప్రతిపాదనను ఇప్పుడూ సమర్థిస్తున్నానని అన్నారు. దేశంలో అత్యున్నత సంప్రదాయానికి బెంగాల్ చిరునామా అని అభివర్ణిస్తూ.. దేశాభివృద్ధి కోసం అందరూ శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కోల్‌కతాలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “ఇన్ఫోసిస్ లో మేము ది బెస్ట్ కోసం పనిచేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో పోటీపడుతున్నాం. అలా అతిపెద్ద ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీని తట్టుకోవాలంటే.. భారతీయులు చాలా శ్రమపడాలి. మేమంతా చాలా పెద్ద పెద్ద కలలు కంటాం. కానీ దేశంలో 80 కోట్లు మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. అంటే దేశంలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కష్టపడి పనిచేయకపోతే.. ఇంకెవరు కష్టపడతారు?” అని ప్రశ్నించారు.
Also Read: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు
నారాయణ మూర్తి పక్కనే ఆపిఎస్‌జి గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా కూడా ఉన్నారు. నారాయణ మూర్తి తాను విద్యార్థిగా ఉన్నప్పడు కమ్యూనిస్టులు, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను తన ఆదర్శాలుగా భావించేవాడినని తెలిపారు. ఆ సమయంలో భారతదేశంలో ఐఐటి ప్రారంభమైందని గుర్తుకు చేసుకున్నారు.
“మా నాన్నగారు దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. చెప్పేవారు. మేమంతా నెహ్రూ, సోషలిజంనే ఆదర్శాలు భావించేవాళ్లం. అప్పుడే నాకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పనిచేసే అవకాశం లభించింది. అది 1970వ దశకం. అక్కడి కెళ్లాక నా ఆలోచనలు మారిపోయాయి. అక్కడ పాశ్చాత్య దేశాల నాయకులు ఇండియా అంటే అవినీతి, ఇండియా అంటే రోత అని చెప్పేవారు. దానికి తగట్టు నా దేశంలో పేదరికం కనిపించేది. అభివృద్ధి పేరుతో గుంతల రోడ్లు దర్శనమిచ్చేవి. పాశ్చాత్య దేశాల నాయకులు చెప్పే మాటలు పూర్తిగా నిజం కాదని కొట్టిపారేయలేం. ఎందుకంటే అక్కడ సమయానికి రైళ్లు వచ్చేవి. ఆ దేశాల్లో అభివృద్ధి కళ్లకు కనిపించేంది. మరి వారు చెప్పేది తప్పు అని ఎలా చెప్పగలం?. అందుకే నేను ఫ్రాన్స్ లో ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని కలిశాను. నాలో ఉన్న అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కానీ ఆయన సమాధానాలు నాకు సంతృప్తినివ్వలేదు.
అప్పుడు నాకు ఒకటి అర్థం అయింది. పేదరికంతో ఒక దేశం పోరాడాలంటే ఉద్యోగాలుండాలి. అందరికీ సరిపడ సంపాదన ఉండాలి. కానీ ప్రభుత్వం ఇందుకు ఏమీ చేయడం లేదనిపించింది. వ్యాపారవేత్తలు మాత్రమే ఉద్యోగాలు సృష్టించగలరు, దేశంలోకి పెట్టుబడులు తీసుకురాగలరు, దేశానికి పన్నుల రూపంలో ఆదాయం అందివ్వగలరని నేను గ్రహించాను. అయితే ఇదంతా సోషలిజంతో కాదు క్యాపిటలిజంతో సాధ్యమవుతుంది. క్యాపిటలిజంను అనుసరిస్తేనే మంచి రోడ్లు, మంచి రైళ్లు, మంచి వసతులు వస్తాయి. ఇండియా ఆ సమయంలో చాలా పేద దేశం. క్యాపిటలిజం ఇక్కడ ఇంకా పుట్టలేదు. అందుకే నేను ఇండియాకు తిరిగొచ్చి క్యాపిటలిజంని అనుసరిస్తూ.. ప్రయోగాలు చేయాలని నిర్ణయించకున్నాను.
మన దేశానికి 4000 సంవత్సరాల పురాతన సంప్రదాయాలున్నాయి. ఈ సంప్రదాయాలు మనందరికీ గర్వకారణం. మన దేశ సంస్కృతి వల్లే క్యాపిటలిజంకు ఇక్కడ చోటు దక్కింది. క్యాపిటలిజంతో పాటు మనం సోషలిజం, లిజరలిజం విలువలను మేళవించి పనిచేయాలి. అప్పుడే దేశం స్థిరంగా ముందుకు సాగుతుంది. మనుషులు ఆలోచించగలరు. ఆ భగవంతుడు మనకు ఆ శక్తిని ప్రసాదించాడు. మరి అలాంటి సమయంలో మనకంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్న వారి గురించి ఆలోచించాలి. ప్రపంచం మన దేశాన్ని గౌరవభావంతో చూసేందుకు నిరంతరం కృషిచేయాలి. శ్రమించాలి. శ్రమపడితేనే గుర్తింపు వస్తుంది. గుర్తింపు వల్ల గౌరవం వస్తుంది. గౌరవం వల్ల అధికారం అందుతుంది. దేశ యువతకు నేను చెప్పేది ఒక్కటే మనందరిపై చాలా పెద్ద పెద్ద బాధ్యతలున్నాయి.. మన పూర్వీకులు కన్న కలలను సాకారం చేసేందుకు దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు చాలా కష్టపడి పనిచేయాలి.” అని భావోద్వేగంగా ప్రసంగించారు.