Japan’s Bank-Adani: బాంబే స్టాక్ మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చాయి అదానీ గ్రూప్ కంపెనీలు. దీంతో ఆయా కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. శుక్రవారం మార్కెట్ ప్రారంభమైన నుంచి అదానీకి చెందిన పలు కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. మధుపరులు ఆయా కంపెనీల షేర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
అమెరికాలో నిధుల సమీకరణకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వజూపారంటూ అదానీపై న్యూయార్క్ న్యాయస్థానంలో అభియోగాలు నమోద య్యాయి. దీని తర్వాత అదానీ గ్రూప్‌కి చెందిన పలు కంపెనీల షేర్లు పతనమయ్యాయి.
ఆయా కంపెనీల షేర్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. స్టాక్స్‌ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపలేదు మధుపరులు. అదానీ ఎనర్జీ సొల్యూషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్టు స్టాక్స్ డబుల్ డిజిట్ స్థాయిలో షేర్లు పతనమయ్యాయి.
గడిచిన నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి నెలకొంది. లంచం అభియోగాలపై అదానీ గ్రూప్ ఖండిస్తూ ఓ ప్రకటన చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలిస్తామంటూ తెలిపింది.
ALSO READ: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం ధరలు..
అదానీ గ్రూప్‌కు జపాన్‌కి చెందిన మిజుహో, సుమిటోమో, మిత్సుబిషి ఫైనాన్షియల్ గ్రూప్ మద్దతుగా నిలిచిందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడుదారుల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఆయా స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు మధుపరులు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీల్లో అదానీ గ్రూప్‌కి చెందిన పలు కంపెనీల షేర్లు జోరందుకున్నాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 14.64 శాతం పెరిగి గరిష్టంగా రూ.1,247.55 ను తాకింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 10.81 శాతం లాభంతో రూ. 806 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్యాస్ 4.74 శాతం పెరిగి రూ. 841.30కి చేరగా, అదానీ పవర్ 2.53 శాతం పురోగమించి రూ. 574.40కి చేరుకుంది.
అటు అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) అదానీ గ్రూప్‌కు తన మద్దతును కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని కంపెనీల్లో పెట్టుబడులపై తమ దృక్పథంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. దీంతో గ్రీన్ ఎనర్జీతోపాటు మిగతా రంగాలకు భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్ ముగిసే వరకు ఇదే జోరు కొనసాగుతుందా? లేదా అనేది చూడాలి.