Loan Planning: సులభంగా రుణాలు లభించే ఈ రోజుల్లో అప్పు తీసుకోవడం చాలా తేలికైపోయింది. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో కనిపించే ఆఫర్లు, ప్రీ అప్రూవ్డ్ మెసేజ్‌లు, కొన్ని క్లిక్‌లతో నిమిషాల్లో డబ్బు ఖాతాలో జమ అవుతోంది. ఇది ఎంతో సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ.. రుణం తీసుకోవడం ఎంత సులభమో, దాని పరిణామాలు అంతగా ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే లోన్ తీసుకునే ముందు కొన్ని ప్రశ్నలకు వేసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో చూద్దాం.
రుణం తీసుకునే ముందు ‘నాకు ఈ అప్పు ఎందుకు అవసరం?’ అనే ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలి. ఇల్లు కొనడానికి లేదా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలు భవిష్యత్తులో ఆస్తులను, విలువను పెంచుతాయి. అలాగే అనుకోని అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడం అనివార్యం కావచ్చు. కానీ కేవలం విహారయాత్రలు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, షాపింగ్ సరదాల కోసం రుణాలు తీసుకోవడం తెలివైన పని అనిపించుకోదు. ఇలాంటి కోరికల కోసం కొంతకాలం వేచి చూసి పొదుపు చేసి కొనుగోలు చేయడమే మంచిది.
రుణం తీసుకునే ముందు కేవలం మీ నెలకు వచ్చే జీతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల చదువుల ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, సిప్ పెట్టుబడులు వంటి ఖర్చులను కూడా లెక్కించాలి. ఈ ఖర్చులన్నీ పోను మిగిలిన మొత్తంలో ఈఎంఐ చెల్లించిన తర్వాత నెల చివర్లో చేతిలో చాలా తక్కువ డబ్బు మిగులుతుంటే, ఆ రుణం మీ సామర్థ్యానికి మించినదని అర్థం చేసుకోవాలి.
చాలామంది వేగంగా డబ్బు జమ అవుతుందనే కారణంతో పర్సనల్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) వైపు మొగ్గు చూపుతారు. కానీ మీ అవసరాన్ని బట్టి ఇతర లోన్ రకాలు చాలా తక్కువ వడ్డీకే లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తీసుకునే రుణాలు.. అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్ల కంటే చాలా తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. కాబట్టి ఆత్రుత పడకుండా సరైన లోన్ రకాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
కొత్త రుణం తీసుకునే ముందు ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతలను ఒకసారి సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. కారు లోన్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, మరొక ఈఎంఐ చెల్లిస్తుంటే.. కొత్తగా మరో ఈఎంఐ జత కావడం బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. బ్యాంకులు ఆదాయాన్ని బట్టి రుణ అర్హతను లెక్కిస్తాయి కానీ జీవనశైలికి ఎంత ఆర్థిక వెసులుబాటు కావాలో మీకంటే బాగా ఎవరికీ తెలియదు.
Also Read: కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?
ప్రస్తుత ఆదాయాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరం. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా, ఆశించిన బోనస్ రాకపోయినా, అనుకోకుండా పెద్ద ఖర్చు ఎదురైనా కూడా ఈఎంఐ చెల్లించగలరా? అని ప్రశ్నించుకోవాలి. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి.. ప్రతి నెలా ఈఎంఐ కడుతూనే కొంతమేర పొదుపు చేసుకునే ఆదాయం ఉందో లేదో చెక్ చేసుకోండి. కొంత డబ్బు పొదుపు రూపంలో ఉంచుకోవడం వల్ల అనుకోని ఆర్థిక సమస్యలు ఎదురైనా ఈజీగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: హోటల్ గదిలో రహస్య కెమెరాలు.. కచ్చితంగా చెక్ చేయాల్సిన 10 సీక్రెట్ ప్రదేశాలు!